నిందితుడు పల్లా సురేంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 60కి పైగా కేసులున్నట్లు గుర్తింపు రూ.1.93 లక్షల నగదు, ద్విచక్రవాహనం స్వాధీనం
ఎంవీపీ కాలనీ (విశాఖ): వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఏటీఎం కార్డులు మార్పిడి చేసి ఘరానా మోసాలకు పాల్పడుతున్న అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం ప్రాంతానికి చెందిన పల్లా సురేంద్రకుమార్ (30)ను ఎంవీపీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1.93 లక్షల నగదు, ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ కాలనీ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీ వెంకటరావు తెలిపిన వివరాలు.. సురేంద్రకుమార్ ఏటీఎం కేంద్రాల వద్ద కాపుకాసి, ముఖ్యంగా వృద్ధులు డబ్బులు తీసేందుకు వచ్చినప్పుడు సహాయం చేస్తానంటూ వారి వెంట వెళ్లేవాడు. ఆ సమయంలో వారి ఏటీఎం కార్డును చాకచక్యంగా దొంగిలించి, అదే బ్యాంకుకు చెందిన మరో కార్డును వారికి ఇచ్చేవాడు. ముందుగానే బాధితుల పిన్ నంబర్ తెలుసుకుని, వారు వెళ్లిపోయిన వెంటనే అసలు కార్డుతో నగదు డ్రా చేసి పరారయ్యేవాడు. బాధితులు తమ కార్డు మారిపోయిందని గుర్తించేలోపే అక్కడి నుంచి తప్పించుకుని ఈ తరహాలో పదుల సంఖ్యలో నేరాలకు పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే 60 కేసులు నమోదై ఉండగా, పలుమార్లు జైలుకు వెళ్లినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇటీవల ఎంవీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దిలపాలెం ఎస్‌బీఐ ఏటీఎం, సీతమ్మధార అల్లూరి విగ్రహం సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎం, అల్లిపురం, గాజువాక, తుని ప్రాంతాల్లో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి, సాంకేతిక ఆధారాల సహాయంతో వారం రోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో చురుకై న పాత్ర పోషించిన సీఐ చక్రధర్‌రావు, ఎస్‌ఐ రాజు పర్యవేక్షణలో పనిచేసిన కానిస్టేబుల్ జగత్ కిరణ్‌ను ఏసీపీ అభినందించారు. సమావేశంలో పలువురు ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


