దేవరాపల్లి: వాలాబు పంచాయతీ శివారు కోడాపల్లిలో ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి తమ రేషన్ కష్టాలకు విముక్తి కల్పించాలని కోడాపల్లి, రామన్నపాలెం, పూలగరువు, ఇప్పగరువు గ్రామాల గిరిజనులు డిమాండ్ చేశారు. కోడాపల్లిలో నాలుగు గ్రామాల గిరిజనులు గురువారం ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. వీరి నిరసనకు గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా దొర మాట్లాడుతూ గిరిజన పంచాయతీ వాలాబులో 14 గిరిజన గ్రామాలు ఉన్నాయని, వీరికి గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంటింటికి రేషన్ సరఫరాను నిలిపివేయడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలాబు పంచాయతీ పరిధిలోని 14 గ్రామాలకు వాలాబులో ఒక్క చోట మాత్రమే ఇవ్వడంతో శివారు గ్రామాలైన బుచ్చెంపాలెం, ఇప్పగరువు, పూలగరువు, రామన్నపాలెం, కోడాపల్లి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బుచ్చెంపాలెం గ్రామస్తులు సుమారు పది కిలోమీటర్ల మేర, మిగిలిన గ్రామాలకు గిరిజనులు ఆరు కి.మీ మేర కాలిన నడకన వెళ్లి రేషన్ తెచ్చుకుంటూ నరకయాతన పడుతున్నారని తెలిపారు. రేషన్ కోసం రోజంతా పనులు మానుకొని పస్తులు ఉండాల్సి దయనీయ పరిస్థితి నెలకొందన్నారు. గతంలో బాధిత గిరిజనుల సంతకాలతో కూడిన వినతి పత్రం సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి కోడాపల్లిలో ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తామర్ల శంకరరావు, సిహెచ్‌బి. లక్ష్మి, సోములు, భీమాలమ్మ, సిహెచ్.చంద్రరావు, కాశీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


