మృత్యువుతో పోరాటం | - | Sakshi
Sakshi News home page

మృత్యువుతో పోరాటం

Jun 12 2026 12:29 AM | Updated on Jun 12 2026 12:29 AM

ఉత్పత్తికి తగ్గ వేతనం

ఉత్పత్తితో వేతనాల ముడి

అమానవీయం.!

విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి ఆధారిత వేతన విధానం కార్మికులపై తీవ్ర ఒత్తిడి పెంచుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తేనే పూర్తి వేతనాలు చెల్లిస్తామని, లేకపోతే కోతలు విధిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. దీంతో జీతాలు తగ్గిపోతాయనే భయంతో కార్మికులు పాత యంత్రాలు, ప్రమాదకర పరిస్థితుల్లోనూ పనిచేయాల్సి వస్తోందని విమర్శించాయి. పలు విభాగాల్లో పూర్తి వేతనాల బదులు శాతం వారీగా మాత్రమే చెల్లింపులు జరుగుతున్నాయని, సగటున 33 శాతం వేతనాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని సంఘాలు తెలిపాయి. ఈ విధానం కార్మికుల భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, ఇటీవల జరిగిన ప్రమాదాలకు కూడా ఇదొక కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డాయి. ఉత్పత్తి లక్ష్యాల కంటే కార్మికుల ప్రాణాలు ముఖ్యమని, పూర్తి వేతనాలు చెల్లించి భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశాయి.

పని చేస్తేనే జీతం ఉంటుందంటూ యాజమాన్యం నిబంధనలు

ఉత్పత్తి చూపించకపోతే వేతనాల్లో కోతలు విధింపు

ఈ భయంతోనే పరిస్థితులు ఎలా ఉన్నా పనిచేస్తున్న కార్మికులు

చంద్రబాబు మార్క్‌ వంచన.. మరణశయ్యపై విశాఖ ఉక్కు

నాడు వీర నినాదాలు.. నేడు కేంద్రానికి వంతపాట

సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారంలో పరిస్థితులు రోజురోజుకూ ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఉత్పత్తి లక్ష్యాలను జీతాలతో ముడిపెట్టడం వల్ల వేతనాల్లో కోతల భయంతో కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. మరోవైపు అనుభవజ్ఞులైన ఉద్యోగులను బదిలీలు చేయడం, వీఆర్‌ఎస్‌ ద్వారా సిబ్బందిని తగ్గించడం వల్ల నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఏర్పడి భద్రతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. దేశంలోని ఇతర స్టీల్‌ ప్లాంట్లతో పోలిస్తే విశాఖ ఉక్కులో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మిగిలిన సిబ్బందిపై పనిభారం పెరిగింది. ప్రైవేటీకరణ చర్యలు, సిబ్బంది కొరత, నిర్వహణ లోపాలు కలిసి ప్లాంట్‌ను సంక్షోభంలోకి నెడుతున్నాయి. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్లాంట్‌ని నిర్వీర్యం చేస్తున్న ఈ దుస్థితికి ముమ్మాటికీ ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే కారణమని కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేగవంతమైన ప్రైవేటీకరణ ప్రక్రియతో విశాఖ ఉక్కు మరణశయ్యపైకి చేరుకుంటోంది. 2021 జనవరిలోనే పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్‌ కమిటీ తీర్మానం చేయగా, వైఎస్సార్‌సీపీ పోరాటంతో అది అడుగు ముందుకు పడలేదు. 2024లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత వేగవంతమైంది. గతంలో ప్రైవేటీకరణను అడ్డుకుంటామని లక్షలాది మంది సాక్షిగా హామీలు ఇచ్చిన చంద్రబాబు, పవన్‌,లోకేష్‌ సహా ఇతర నేతలు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తిగా వంతపాడుతున్నారు. పార్లమెంటులో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానమిస్తూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కార్మికులను వంచనకు గురిచేస్తోంది.

ముడిసరకు, బొగ్గు సరఫరాలో కుట్రలు.!

కర్మాగారంలో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగకపోవడానికి యాజమాన్యం, ప్రభుత్వాల వైఫల్యాలే కారణం. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలంటూ ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా స్పందించని చంద్రబాబు ప్రభుత్వం.. నక్కపల్లిలో నిర్మితమవుతున్న ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్‌కు మాత్రం సొంత గనులు కేటాయించేశారు. స్టీల్‌ప్లాంట్‌కు రోజుకు కనీసం 6 రేక్‌ల బొగ్గు అవసరం కాగా, పూర్తిస్థాయి ఉత్పత్తికి 9 రేక్‌లు కావాలి. కానీ గత ఆరేడు నెలలుగా నెలకు కేవలం 5 రేక్‌లు మాత్రమే వస్తున్నాయి. ఒకే రైల్వే లైన్‌ ఉన్నందున భవిష్యత్తులో మిట్టల్‌ సంస్థకే బొగ్గు సరఫరా చేసి విశాఖ ఉక్కును పూర్తిగా నిర్వీర్యం చేసే వ్యూహాత్మక కుట్ర జరుగుతోందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

అనుభవ లేమితో ప్రమాదకరంగా మారిన భద్రత

ఉక్కు కర్మాగారంలో 2024కు ముందు వరకు శాశ్వత ఉద్యోగుల సంఖ్య 12,600 మంది ఉండగా, వారిని సాగనంపేందుకు యాజమాన్యం అనేక ఆంక్షలు, బెదిరింపులకు దిగింది. వీఆర్‌ఎస్‌ పేరుతోనూ, ఇతర కారణాలతోనూ ఉద్యోగులను తొలగించడంతో ప్రస్తుతం కేవలం 8,600 మంది మాత్రమే శాశ్వత సిబ్బంది మిగిలారు. అదేవిధంగా 2024కి ముందు వరకు 20 వేల మంది కాంట్రాక్టు సిబ్బంది ఉండగా.. ఒకేసారి 10 వేల మందిని తొలగించి, దశలవారీగా మరో 2,000 మంది వరకు తీసేశారు. వీరి స్థానంలో ఇతర ప్రాంతాల నుంచి అనుభవం లేని కార్మికులను నియమించుకోవడంతో ప్రస్తుతం ప్లాంట్‌లో కేవలం 8,000 నుండి 9,000 మంది కాంట్రాక్టు కార్మికులు మాత్రమే ఉన్నారు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు, కోక్‌ ఓవెన్ల వంటి అత్యంత ప్రమాదకర విభాగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ఉద్యోగులను తొలగించి, తీవ్ర సిబ్బంది కొరతతో పనులు చేయిస్తుండటం వల్ల ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు పూర్తిగా క్షీణించాయి. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని భయానక వాతావరణంలో, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కార్మికులు మృత్యువుతో పోరాడుతున్నారు. విశాఖ ఉక్కును కాపాడటానికి ‘సెయిల్‌’లో విలీనం చేయడమే ఏకై క శాశ్వత పరిష్కారమని, ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కార్మిక లోకం ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement