మెడికల్‌ షాపులు | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ షాపులు

Mar 16 2026 7:44 AM | Updated on Mar 16 2026 7:44 AM

‘మత్తు’లో

మహారాణిపేట: నగరంలో మత్తు మందుల వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా జోరుగా సాగుతోంది. అదనపు లాభాల కోసం కొన్ని మెడికల్‌ షాపుల నిర్వాహకులు, వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకపోయినా మత్తు ఇచ్చే ఇంజెక్షన్లు, పెయిన్‌ కిల్లర్లు మరియు దగ్గు మందులను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఈ అమ్మకాలు మరింత అధికమవుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.

మెడికల్‌ పరిజ్ఞానం లేని వ్యక్తులతో..

ఈ విక్రయాల్లో ప్రధాన లోపం..అర్హత కలిగిన ఫార్మసిస్టులు లేకపోవడమే... మెడికల్‌ పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ, నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మందుల విక్రయాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వకపోవడం, ప్రిస్క్రిప్షన్‌ రిజిస్టర్లను నిర్వహించకపోవడం, కంప్యూటరైజ్డ్‌ రికార్డులను పక్కన పెట్టడం వంటి అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. గడువు ముగిసిన మందులను కూడా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఔషధ నియంత్రణశాఖ పర్యవేక్షణ లేక

ఔషధ నియంత్రణ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం ఈ పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. విశాఖ ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 4,500 మెడికల్‌ షాపులు, ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న షాపుల్లో ఎటువంటి రిజిస్టర్లు, కంప్యూటర్లు లేకుండానే కార్యకలాపాలు సాగుతున్నాయి. గతంలో జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన విజయకుమార్‌ బదిలీ అయినప్పటి నుంచి, ఆ స్థానంలో రెగ్యులర్‌ అధికారిని నియమించలేదు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్‌ రజిత ఇన్చార్జీ ఏడీగా అదనపు బాధ్యతలను చూస్తున్నారు. అయితే ఆమె ఇప్పటికే విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఏడీగా, ఉత్తరాంధ్ర డీడీగా కూడా పనిచేస్తుండటంతో, విశాఖపై పూర్తిస్థాయి దృష్టి సారించడం అసాధ్యంగా మారింది. ఈ నాయకత్వ లోపం కారణంగా, అక్కడ పనిచేస్తున్న డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది తనిఖీలను మొక్కుబడిగా చేస్తూ, నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. కేవలం వార్షిక లేదా నెలవారీ లక్ష్యాల కోసం, ఏదో ఒకటి రెండు కేసులు నమోదు చేసి నిబంధనలను పాటించామన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టేలా సోదాలు జరగడం లేదు.

నగరంలో జోరుగా నిషేధిత మందులు అమ్మకాలు వివిధ శాఖల అధికారులు పర్యవేక్షణ లోపం వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా దగ్గు మందులు, ఇంజక్షన్ల అమ్మకాలు

వెలుగు చూసిన వ్యవహారం

ఇటీవల మర్రిపాలెంలో జరిగిన ఒక సంఘటన ఈ వ్యవస్థలోని లోతైన వైఫల్యాలను బయటపెట్టింది. ప్రభుత్వం నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు నిషేధించిన ఒక మందుల మిశ్రమాన్ని విక్రయిస్తున్న మెడికల్‌ ఏజెన్సీని గుర్తించారు. ఈ వ్యవహారం వెలుగుచూడటంతో, వైద్యుని ప్రిస్క్రిప్షన్‌ లేకుండా కోల్డ్‌/కఫ్‌ సిరప్స్‌ విక్రయించవద్దని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ దాడుల ద్వారా నిషేధిత మందుల అమ్మకాలు జరుగుతున్న విషయం వాస్తవమేనని నిరూపితమైనా, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశంలో ఔషధ నియంత్రణ శాఖ మొద్దు నిద్ర వీడి, కఠినమైన ఆకస్మిక తనిఖీలను నిర్వహించాల్సిన తరుణం ఆసన్నమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement