గాజువాక (విశాఖ): నగరంలోని జాతీయ రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనల పట్ల అధికారుల ఉదాసీనత కారణంగా నగరం మృత్యుపాశంగా మారుతోంది. ముఖ్యంగా భారీ వాహనాల అతివేగం, నిబంధనలకు విరుద్ధంగా రద్దీ సమయాల్లోనూ నగరంలోకి ప్రవేశించడం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది.
నిషేధాజ్ఞలు బేఖాతరు
నిజానికి ఉదయం 8 గంటల లోపు, రాత్రి 10 గంటల తర్వాతే భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి ఉంటుంది. కానీ ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. గాజువాక వంటి రద్దీ ప్రాంతాల్లో పరిశ్రమల సాకుతో లారీలు, టిప్పర్లు ఇష్టానుసారంగా దూసుకువస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించినా.. చర్యలు తీసుకున్నా ఎక్కడా పరిస్థితి మారడం లేదు.
ఆదివారం...విషాదం : ఆదివారం బీహెచ్‌పీవీ జంక్షన్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సోమవారం పదో తరగతి పరీక్షలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో కుమార్తె సింహాచలం దర్శనం నిమిత్తం తీసుకువెళ్లిన తండ్రిని, వచ్చే నెలలో వివాహం జరుపుకోవాల్సిన ఓ యువకుడిని టిప్పర్ చిదిమేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే విశాఖ డెయిరీ వద్ద జరిగిన మరో ప్రమాదంలో యువతి మృత్యువాత పడింది. ఇలా రోజుకో ప్రాణం గాలిలో కలుస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారు. ఇప్పటికైనా భారీ వాహనాలపై కఠిన ఆంక్షలు అమలు చేయాలని విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
వాహనం అదుపు తప్పి యువతి మృతి : మరొకరికి గాయాలు
గాజువాక : ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒక యువతి మృతి చెందగా, మరో యువతి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలివి. పార్వతీపురానికి చెందిన మహాలక్ష్మి, తునికి చెందిన అనుష్క స్థానిక బీహెచ్‌ఈఎల్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. వారిద్దరూ ఆదివారం ఒకే ద్విచక్ర వాహనంపై కంపెనీవద్ద బయల్దేరి షీలానగర్ వైపు వెళ్తున్నారు. విశాఖ డెయిరీ జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఆ వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకొన్నారు. దీన్ని గమనించిన సమీపంలోని ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కాగా, మహాలక్ష్మి మార్గంమధ్యలోనే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. అనుష్క తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్టు సీఐ షేక్ హుస్సేన్ తెలిపారు.


