సింహాచలం: ప్లాస్టిక్‌ను అరికట్టి పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), ఆంధ్ర యూనివర్సిటీ ఆర్‌ఎస్‌ఎస్ విభాగం, ఖేలో భారత్ సంస్థ సంయుక్తంగా ఆదివారం మాధవధార నుంచి సింహాచలం కొండపైకి ట్రెకింగ్ నిర్వహించాయి. సుమారు వంద మంది యువకులు, విద్యార్థులు ఈ ట్రెకింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతిని ప్రేమించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్‌ను నిషేధించాలి అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రతినిధులు తెలిపారు. ట్రెకింగ్ మార్గ మధ్యలో పడి ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి పర్యావరణ స్పృహను చాటారు. అనంతరం సింహగిరికి చేరుకున్న విద్యార్థి బృందాన్ని దేవస్థానం ఈవో జె.వెంకటరావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడేందుకు విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. పుణ్యక్షేత్రాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర కీలకమని సూచించారు. ఖేలో భారత్ కన్వీనర్ విజయ్, సభ్యులు చందు తదితరులు పాల్గొన్నారు.


