నాతవరం : మండలంలో జిల్లేడుపూడి పంచాయతీలోని బుచ్చింపేటలో నూకాలమ్మతల్లి ఆలయం ఉంది. ఈ అమ్మవారి పండగను ప్రతి ఏటా కొత్త అమావాస్యకు ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ ప్రాంతీయులతో పాటు ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలు జాతరకు తరలివస్తారు. పండగను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతీయులు ఏ పని తలపెట్టినా ముందుగా అమ్మవారిని దర్శించుకొని ప్రారంభిస్తే అవలీలగా పూర్తవుతుందన్న అపారమైన నమ్మకం ఉంది. సోమవారం నుంచి అమ్మవారి ప్రాంగణంలో హోమాలు ప్రత్యేక పూజలు చేసేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. అమ్మవారి పండగ కొత్త అమావాస్య బుధవారం రావడంతో మంగళవారం సాయంత్రం నుంచే వేలాది మంది భక్తులు రానున్నారు. భక్తులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించారు. అలయ ప్రాంగణంలో మొక్కులు చెల్లించుకునే వారికి ఐరన్ క్యూలైను ఏర్పాటు చేశారు. ఆలయం ప్రాంగణంలో తాగునీటి కోసం ప్రత్యేకంగా కుళాయిలు ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ ఉచితంగా తీర్థప్రసాదాలు అందించడానికి టెంట్లతో పాటు కౌంటర్లు సమకూర్చారు.
ఆలయ చరిత్ర ఇదీ!
బుచ్చింపేట నూకాలమ్మ తల్లి అమ్మవారు మొదట్లో అడవి ప్రాంతాన్ని తలపించే తోటల మధ్యలో మర్రిచెట్లు నీడలో తాటాకు పాకలో ఉండేవారు. రాతి విగ్రహాలను అమ్మవారిగా ఈ ప్రాంతీయులు పూజించేవారు. విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంటుకు నీటిని తరలించేందుకు తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏలేరు కాలువ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జిల్లేడుపూడి ప్రాంతంలో ఎత్తయిన ప్రాంతం కావడంతో ఏలేరు కాలువ తవ్వడానికి కుదరలేదు. నీటిని తరలించేందుకు ఇక్కడ సొరంగం తీయాలని నిర్ణయించారు. ఇరువైపులా ఏలేరు కాలువ పూర్తి చేశారు. సొరంగం పనులు జరగలేదు. అప్పట్లో ఎం.ప్రభాకర్ చౌదరి అనే వ్యక్తి ఏలేరు కాలువ సొరంగం తీస్తానని ముందుకు వచ్చాడు. మొదట్లో అయన కూడా పనులు చేయలేకపోయాడు. ఈ ప్రాంతీయులు ఏపని చేపట్టాలన్నా మర్రిచెట్టు పొదలో శిథిలమైన తాటాకు పాకలో ఉన్న అమ్మవారిని దర్శించుకునే చేపడతారని ఓ వృద్ధుడు సలహా ఇవ్వడంతో అతని మాట ప్రకారం అమ్మవారిని దర్శించుకుని పనులు సక్రమంగా పూర్తయితే ఆలయ నిర్మాణం చేస్తానని మొక్కి పనులు ప్రారంభించారు. దీంతో అంతవరకు తవ్వుతుంటే కూలిపోయే సొరంగం చక చకా పనులు సాగిపోతున్నాయి. గడువుకు ముందే సొరంగం పూర్తి కావడంతో అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారం 1988లో సొంత నిధులతో అతను మర్రిచెట్టు ఊళ్లమధ్యలో సర్వాంగ సుందరంగా అమ్మవారి ఆలయం నిర్మాణం చేశారు. అమ్మవారికి కుడి వైపు 30 అడుగులు ఎత్తులో నాగసర్పంతో కూడిన శివలింగం, ఎడమ వైపు ఏనుగు తొండంలో కన్పించే విధంగా వినాయకుడి ఆలయం నిర్మించారు. అంజనేయస్వామి, మహాలక్ష్మి అమ్మవారుతో పాటు పలు దేవుళ్ల విగ్రహాలు, నవగ్రహాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏటా ఉగాదికి ఇక్కడ అమ్మవారి పండగ ఘనంగా చేస్తున్నారు. ప్రభాకర్‌చౌదరి 2022లో మృతి చెందగా, జిల్లేడుపూడి గ్రామస్తులు ఆలయ ఉత్సవ కమిటీగా ఏర్పడి అమ్మవారి పండగ నిర్వహిస్తున్నారు.
కొత్త అమావాస్య రోజున పండగ
సోమవారం నుంచి ఆలయ ప్రాంగణంలో హోమాలు ప్రత్యేక పూజలు
పండగ సందర్భంగా సాంస్కృతిక
కార్యక్రమాలు


