చోడవరం: గంజాయి కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు గురువారం తీర్పు వెలువరించిందని ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. వివరాల్లోకి వెళితే... 2017 సంవత్సరం జనవరి 11న రావికమతం మండలం కొత్తకోట వద్ద పోలీసులు స్మగ్లర్ వర్రి నర్సింగరావును పట్టుకుని, 138 కిలోల గంజాయి, ఒక కారు, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి కొత్తకోట ఎస్‌ఐ ఎం.శేఖరం కేసు నమోదు చేశారు. వాదోపవాదాలు విన్న చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.హరినారాయణ... నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు. 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేని పక్షంలో మరో ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురపల్లి సూర్యనారాయణ అన్ని వివరాలు కోర్టుకు అందించడంతో నేరం రుజువైందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నేరస్తునికి శిక్ష పడేలా అన్ని సాక్షాధారాలు సేకరించిన వారందరికీ ఎస్పీ అభినందనలు తెలిపారు.


