మత్స్యకారులకు వర ప్రసాదిని కానున్ను హార్బర్ నిర్మాణం అంచనాలకు చంద్రబాబు ప్రభుత్వం కత్తెర వేసింది. దీంతో పూర్తిస్థాయిలో ప్రయోజనాలు అందే అవకాశం లేకుండా పోతోంది. గంగపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.393 కోట్ల అంచనా వ్యయంతో పూడిమడక సమీపాన మొగ ప్రాంతంలో హార్బర్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టగా, చంద్రబాబు ప్రభుత్వం ఆ అంచనాలు తగ్గించి వేసింది. దీంతో పూర్తిస్థాయిలో మత్స్యకారులకు ప్రయోజనాలు సమకూరకుండా చేస్తోంది.
హార్బర్ అంచనాలకు
పూడిమడక వద్ద తీరం
సాక్షి, అనకాపల్లి: ఇటు వైజాగ్ హార్బర్... అటు ఒడిశా పారాదీప్... మధ్యలో ఎక్కడా ఫిషింగ్ హార్బర్ లేదు. దాదాపు 200 కిలోమీటర్ల దూరం వరకు హార్బర్ లేకపోవడంతో మత్స్యకారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా తుపానులు, విపత్తులు వచ్చిన సందర్భాల్లో బోట్లు సురక్షితంగా హార్బర్‌కు తీసుకువచ్చేందుకు మత్స్యకారులు నరకం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అందులోనూ జిల్లాకు చెందిన మత్స్యకారులు ఎక్కువగా ఫిషింగ్‌కు ఒడిశా వైపునకే వెళ్తుంటారు. మరోవైపు వైజాగ్‌లోనే దాదాపు 700కి పైగా మెకనైజ్డ్ బోట్లు, 3వేల ఫైబర్ బోట్లు, 400 చిన్న పడవలు ఉండటంతో ఇక్కడి హార్బర్ సామర్థ్యం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపాన మొగ ప్రాంతంలో హార్బర్ నిర్మించాలన్న డిమాండ్ దశాబ్దాల కాలంగా ఉన్నా ఎవరూ ముందుకు రాలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పూడిమడకలో హార్బర్ ఏర్పాటుకు రూ.393 కోట్లతో ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజుల పూర్తయ్యే సరికే ..మత్స్యకారుల జీవనోపాధి కల్పించే పూడిమడక హార్బర్ అంచనాలకు కత్తెర వేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల వలసలను తగ్గించడమే కాకుండా వారి జీవనోపాధిని మెరుగుపరిచేవిధంగా పూడిమడకలో అధునాతన మత్స్యకార ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడితే..ఇప్పుడు దాన్ని కూటమి ప్రభుత్వం కుదించింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఆ తరువాత కేంద్ర ఫిషరీష్ శాఖ నుంచి శాస్త్రవేత్తలు పూడిమడక వద్ద నిర్మాణం చేపట్టే ఫిషింగ్ హార్బర్ స్థలం, అక్కడ పరిస్థితులు పరిశీలించి, కేంద్రానికి నివేదిక సమర్పించారు. కానీ ఇప్పటికీ పనుల్లో పురోగతి లేదు. త్వరగా నిర్మాణం జరిగితే ఈ ప్రాంత మత్స్యకారుల జీవన పరిస్థితులు మారతాయనే ఆశ నెరవేరడం లేదు. హార్బర్ నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
తగ్గనున్న సౌకర్యాలు
గత ఏడాది ఢిల్లీకి చెందిన వాటర్ అండ్ పవర్ కన్సెల్టెన్సీ సర్వీసెస్ లిమిటెట్(వాప్కోస్) సంస్థ సర్వే చేసి ఇక్కడి ప్రాంతం హార్బర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని స్పష్టం చేసింది. జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో 18 వేల మందికిపైగా జనాభా ఉండగా.. 16,400 మంది చేపలవేటపైనే జీవనం సాగిస్తున్నారు. ఈ హార్బర్‌నిర్మాణం పూర్తయితే వివిధ వృత్తులకు చెందిన ఐదువేలకు పైగా కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుంది. ఈ గ్రామ పరిధిలో మొత్తం 340 రిజిస్టర్ బోటులున్నాయి. అందుకే.. పూడిమడకని హార్బర్ కోసం ఎంపిక చేశారు. ఇక్కడ నిర్మించనున్న హార్బర్‌లో 930 బోట్లు నిలిపేందుకు అవకాశం కలిగేలా హార్బర్ నిర్మాణం కానుంది. 700 వరకూ 9 మీటర్ల మోటరైజ్డ్ బోట్లు, 200 వరకూ 18 మీటర్ల మెకనైజ్డ్ బోట్లు, 30కి పైగా 24 మీటర్ల టూనా లాంగ్ లైనర్లు ఇక్కడి నుంచి ఆపరేట్ చేసే అవకాశం కలగనుంది. ఏడాదికి 28వేల టన్నుల వరకూ మత్స్య సంపద నిర్వహణ సామర్థ్యం ఉండేలా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం సాగనుంది.
వ్యాపకోస్ సంస్థ అధ్యయనం ప్రకారమే..
ఉత్తరాంధ్రలోనే రెండో అతిపెద్ద ఫిషింగ్ హార్బర్‌గా పూడిమడక హార్బర్ రూపొందనుంది. 2017–18 లోనే ఇక్కడ చేపల రేవు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యాపకోస్ సంస్థ అధ్యయనం చేసింది. ఓడరేవు నిర్మాణంతో స్థానికంగా జరగనున్న అభివృద్ధి. ..నిర్మాణ, నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర నివేదికను అందించింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రజాభిప్రాయసేకరణ కూడా అప్పుడు చేపట్టారు. పూడిమడక ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ఏడాది అక్టోబర్ నెలలో కేంద్ర ఫిషరీష్ విభాగం నుంచి శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించి వెళ్లారు.
విశాఖ హార్బర్‌పై తగ్గనున్న భారం...
పూడిమడకలో హార్బర్ నిర్మాణం పూర్తయితే.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌పై చాలా వరకూ భారం తగ్గనుంది. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ పరిధిలో 720 మెకనైజ్డ్ బోట్లు, 3వేలకు పైగా ఇంజిన్ బోట్లున్నాయి. ఏటా 5 నుంచి 10 శాతం వీటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. పూడిమడకలో హార్బర్ ఏర్పాటైతే.. చాలా వరకూ బోట్లను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. కేవలం పూడిమడక మాత్రమే కాకుండా.. పాయకరావుపేట, ఎస్.రాయవరం, రాంబిల్లి, పరవాడ ప్రాంత మత్స్యకారులకు కూడా చాలా ప్రయోజనాలు కలగనున్నాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పూడిమడక హార్బర్ నిర్మాణానికి రూ.393 కోట్లతో ప్రతిపాదనలు
చంద్రబాబు ప్రభుత్వంలో రూ.300 కోట్లకు తగ్గింపు
ఏటా 28,700 టన్నుల మత్స్య ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా ప్రణాళికలు
900 బోట్లు, ట్రాలర్ల నిలుపుదలకు అవకాశం
గత ఏడాది వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన పీఎం మోదీ
చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టును రూ.300 కోట్లకు కుదింపు
ఎగుమతులపై బడ్జెట్ తగ్గింపు ప్రభావం
పనుల్లో పురోగతి శూన్యం
పనులు జరగడం లేదు
పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ అంచనాలను కుదించారు. పోనీ పనులు కూడా ప్రారంభించనే లేదు. గత ఏడాది అక్టోబర్ నెలలో పీఎం మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆ రోజు నుంచి నేటి వరకూ పురోగతి లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మత్స్యకారుల జీవన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం హార్బర్‌ను తీసుకొస్తే..అప్పటి అంచనాలు తగ్గించడమే కాకుండా పనులు కూడా జరపడం లేదు. అదే సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉండి ఉంటే ఈ 20 నెలల్లో సగానికి పైగా పనులు పూర్తయ్యేవి. ఈ పూడిమడక హార్బర్ పూర్తయితే ఈ ప్రాంత మత్స్యకారులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి, జీవనోపాధి కలుగుతుంది. బోట్లు మోసుకుని సముద్రంలోకి వెళ్లే బాధ తప్పుతుంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ తరువాత ఎక్కువ చేపలు పూడిమడక తీరంలోనే ఎక్కువగా పడతారు. ఇక్కడ లభించిన చేపలు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. హార్బర్‌తోపాటు వివిధ వృత్తుల వారు కూడా 5వేలకు పైగా కుటుంబాల వారు స్థానికంగా లాభపడతారు.
– చోడిపల్లి శ్రీనివాస్, మత్సకార కార్పొరేషన్ మాజీ డైరెక్టర్


