నాడు వేసిన పునాదులే..
నాడు వేసిన పునాదులే..నేడు అభివృద్ధి చిహ్నాలుగా తలెత్తుకు నిలుస్తున్నాయి...గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమైన సచివాలయ భవనాలు...పాఠశాల వసతి గృహాలు, సామాజిక భవనాలు నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. నాడు ప్రతిపక్షంలో ఉండగా సచివాలయ భవనాల నిర్మాణాలపై దుమ్మెత్తి పోసిన కూటమి నేతలు నేడు వాటి ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం గమనార్హం. పేరు మార్చినా గత ప్రభుత్వం నిర్మించిన భవనాల్లోనే కొనసాగించక తప్పని పరిస్దితి నెలకొంది. సచివాలయాలు అన్ని సదుపాయాలతో నిర్మించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది.
నక్కపల్లి: మండల కేంద్రం నక్కపల్లిలో గత ప్రభుత్వ హయాంలో మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న కేజీబీవీ టైప్4 బాలికల వసతి గృహన్ని నేడు ప్రారంభించనున్నారు. మండల కేంద్రం నక్కపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికల వసతి కోసం గత ప్రభుత్వం సుమారు రూ.3 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8,9,10 తరగతులకు చెందిన స్థానిక విద్యార్థులకు రాత్రిపూట ఇక్కడ వసతి కల్పిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో చదువుకుని ఇళ్లకు వెళ్లకుండా ఈ వసతి గృహంలో ఆశ్రయం పొందొచ్చు. భోజన వసతి సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని గత వైస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పించింది. అన్ని హంగులతో కూడిన వసతి గృహాన్ని నిర్మించేందుకు నిధులు విడుదల చేయడంతో ఉపమాక రోడ్డులో దీన్ని నిర్మించారు. నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల్లో అదనపు భవనాలు, ఆకర్షణీయమైన తరగతి గదులు, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, ఆధునిక వసతులతో కూడిన మరుగుదొడ్లు, ఆట స్థలం, డైనింగ్ హాలు నిర్మించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాడు ముందు చూపుతో ఉన్నత పాఠశాలల్లో చదివే స్థానిక విద్యార్థుల కోసం ఈ వసతి గృహాన్ని నిర్మించింది. అప్పటి ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా నేటికి ఈ భవనం పూర్తయింది. సోమవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఇన్‌చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
రూ.40 లక్షలతో సచివాలయం...
ఉపమాకలో సుమారు రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనాన్ని కూడా మంత్రులతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమైన సచివాలయం పూర్తయి ఏడాదికిపైనే అవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దీన్ని ప్రారంభించలేదు. అయితే పెద్ద గ్రామమైన ఉపమాకలో సచివాలయం, సామాజిక భవనంలో సరైన వసతులు లేని చోట నిర్వహిస్తున్నారు. నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్దంగా ఉన్న ఈ భవనాన్ని ప్రారంభించక తప్పలేదు. సచివాయాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు వృధా చేస్తున్నారని ప్రతిపక్షంలో ఉన్పప్పుడు విమర్శలు చేసిన కూటమి నేతలే ఇప్పుడు గత ప్రభుత్వ నిధులతో నిర్మించిన సచివాలయాలకు శంకుస్థాపన చేయడానికి రావడం విశేషం. పేరు మార్చినా గత ప్రభుత్వం నిర్మించిన భవనాల్లోనే కొనసాగించక తప్పని పరిస్దితి నెలకొంది. సచివాలయాలు అన్ని సదుపాయాలతో నిర్మించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. ఒకనాడు పలు పంచాయతీలు నూతన భవనాలకు నోచుకోని దుస్దితి ఉండేది. శిథిల భవనాల్లోను, పెచ్చులు రాలుతున్న భవనాల్లోను పెంకుల షెడ్లలోను పంచాయతీ కార్యకలాపాలు, సమావేశాలు నిర్వహించాల్సి వచ్చేది. కార్యదర్శికి సైతం ప్రత్యేక గది లేకపోవడంతో సామాజిక భవనాల్లోను రచ్చ బండల వద్ద విధులు నిర్వహించేవారు. 2019లో జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అన్ని హంగులతో కూడిన సచివాలయ భవనాలను నిర్మించారు. కార్యదర్శితో సహా 12 ప్రభుత్వ శాఖల సిబ్బందిని నియమించి వారికి ప్రత్యేకంగా చాంబర్లు సైతం ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు వివిధ అవసరాల కోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సచివాలయాల్లోనే అన్ని సేవలు పొందేవారు. గత ప్రభుత్వం నాటిన సచివాలయ విత్తనం నేడు మహావృక్షాలై ప్రజలకు సేవలందిస్తున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ సచివాలయాలపేరు మార్చేసి స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు అని పెట్టింది. గత ప్రభుత్వ అభివృద్ధిని సేవలను ప్రజల హృదయాల్లో నుంచి చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం వీటిని సచివాలయాలుగానే పరిగణిస్తున్నారు. అవే సచివాలయాలను కూటమి మంత్రులు సైతం ప్రారంభోత్సవాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటి ప్రభుత్వ కార్యకలాపాలకు అవే దిక్కయ్యాయని పలువురు పేర్కొంటున్నారు.
నాడు అభివృద్ధి పనులకు నిధులు..
నేడు ప్రారంభోత్సవాలు
జగన్ ప్రభుత్వంలో ముందుచూపుతో నిర్మించిన భవనాలు
నేడు ప్రజలకు ఎంతో
ఉపయుక్తంగా సేవలు
నాడు వేసిన పునాదులే..


