అచ్యుతాపురం కేంద్రంగా గ్రావెల్‌ దందా | - | Sakshi
Sakshi News home page

అచ్యుతాపురం కేంద్రంగా గ్రావెల్‌ దందా

Jan 5 2026 8:04 AM | Updated on Jan 5 2026 8:04 AM

అచ్యు

అచ్యుతాపురం కేంద్రంగా గ్రావెల్‌ దందా

అచ్యుతాపురం: జిల్లాలో గ్రావెల్‌ దందాకు పెట్టింది పేరు యలమంచిలి నియోజకవర్గం. ఈ ప్రాంతంలో ఉన్న ఎస్‌ఈజడ్‌ పరిధిలోని నూతన కంపెనీలకు అవసరమైన గ్రావెల్‌ సరఫరాతో పాటు, రోడ్డు విస్తరణ పనులకు గ్రావెల్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో రాత్రి వేళల్లో గ్రావెల్‌ మాఫియా రెచ్చిపోతోంది. ముఖ్యంగా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో గ్రావెల్‌ తవ్వకాలను స్థానికులు అడ్డుకుంటున్నప్పటికీ మైనింగ్‌, రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా శనివారం రాత్రంతా కొండకర్ల–అందలాపల్లి కొండ వద్ద గ్రావెల్‌ తవ్వేస్తున్నారని తెలుసుకున్న స్థానికులు ఆదివారం ఉదయం అడ్డుకునేందుకు తరలివెళ్లడంతో అక్కడి నుంచి వాహనదారులు ఉడాయించారు. ఈ తతంగంలో జిల్లాలోని ఆర్‌అండ్‌బీ జేఇగా పనిచేస్తున్న ఒక అధికారి బంధువు చక్రం తిప్పడం కొసమెరుపు.

పర్యాటక ప్రాంతానికి పెనుముప్పు...

అచ్యుతాపురం మండలంలో ఉన్న కొండకర్ల ఆవను ఎకో టూరిజంగా ప్రకటించారు. అంతే కాకుండా ఆవ సరిహద్దులో చిత్తడి నేలల అభివృద్ధి పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. సుమారు రెండు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండకర్ల–వాడ్రాపల్లి ఆవకు ఉన్న ప్రత్యేకత విదేశీ పక్షుల తాకిడి. ఆవలో సంచరించే పక్షులు సమీపంలో ఉన్న కొండల పొదల్లో రాత్రి వేళ తలదాచుకుంటాయి. అందలాపల్లి కొండపై నెమళ్లు, పక్షుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ కొండను సంరక్షించాల్సిన బాధ్యత పర్యాటక శాఖతో పాటు, రెవెన్యూ, మైనింగ్‌ శాఖలకు ఉంది. సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అందలాపల్లి కొండలో కొంత విస్తీర్ణాన్ని గ్రామసభ ఆమోదం లేకుండా లూజ్‌ సాయిల్‌ తవ్వకాలకు అనుమతిస్తూ లీజు మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది.

యంత్రాలతో తవ్వకాలు...

అందలాపల్లి కొండపై కొద్ది రోజుల నుంచి యంత్రాల సాయంతో గ్రావెల్‌ను తవ్వుతున్నారు. రెండు పొక్లెయినర్లు, పదికి పైగా లారీల సాయంతో ఇక్కడి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న ఆర్‌అండ్‌బీ జేఈ బంధువు లీజుల హక్కులున్నాయంటూ బుకాయించడం గమనార్హం. కొండకు ఒక వైపున మంచి నీటి ట్యాంక్‌ ఉంది. యంత్రాల సాయంతో కొండను తవ్వడం వల్ల ఆ ప్రాంతమంతా బుగ్గిమయమైంది.

కోర్టును ఆశ్రయించేందుకు స్థానికులు సన్నద్ధం..

అందలాపల్లి కొండను గ్రావెల్‌ తవ్వకాలకు లీజు ఇవ్వడంపై స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై కోర్టుని ఆశ్రయించేందుకు సన్నద్ధం అవుతున్నారు. కేవలం లూజ్‌ సాయిల్‌ మాత్రమే తవ్వుకునే లీజు ఉందని, దానికి కూడా ఎటువంటి గ్రామ సభ ఆమోదం లేదని వారు చెబుతున్నారు. యంత్రాల సాయంతో బండరాళ్లను పెకిలించడం వల్ల కొండపై ఉండే పక్షులు, నెమళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతున్నాయని, తద్వారా కొండకర్ల టూరిజానికి తీవ్ర విఘాతం ఏర్పడనుందని వారు వాపోతున్నారు.

కొండకర్ల అందలాపల్లి కొండపై తవ్వకాలు జరిపిన ప్రాంతం

వీఆర్‌ఓను పంపించాం..

అందలాపల్లి కొండపై గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీఆర్‌ఓను పంపించాం. వాస్తవానికి అక్కడి ఒక జేసీబీ ఉంది. మైనింగ్‌ వాళ్లు కేటాయించిన స్థలంలో తవ్వకాలు జరిపితే మేం అడ్డుకోం. పరిధి దాటితే మాత్రం చర్యలుంటాయి. లీజు దారులు ఇంకా తవ్వకాలు మొదలు పెట్టలేదని చెబుతున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో అక్కడి పరిధిని పరిశీలిస్తాం.

– వరహాలు, తహసీల్దార్‌

గ్రామ సభ ఆమోదం లేదు..

అందలాపల్లి కొండపై గ్రావెల్‌ తవ్వకాలకు గ్రామ సభ ఆమోదం లేదు. పక్కనే వాటర్‌ ట్యాంక్‌ ఉంది. కేవలం లూజ్‌ సాయిల్‌ తవ్వుకునేందుకు స్థానికుల ఆమోదం లేకుండా అనుమతిచ్చారు. యంత్రాలతో కొండను తవ్వేస్తున్నారు. దీనివల్ల టూరిజం ప్రాంతమైన ఆవ నుంచి వచ్చే పక్షులు, నెమళ్లు వలస వెళ్లిపోతున్నాయి.

–శివ, స్థానికుడు

అడ్డుకున్న కొండకర్ల–హరిపాలెం వాసులు

చక్రం తిప్పుతున్న ఆర్‌అండ్‌బీ

జేఈ బంధువు

పట్టించుకోని మైనింగ్‌, రెవెన్యూ విభాగాలు

పర్యాటక ప్రాంతం కొండకర్ల

ఆవకు పెనుముప్పు

అచ్యుతాపురం కేంద్రంగా గ్రావెల్‌ దందా1
1/1

అచ్యుతాపురం కేంద్రంగా గ్రావెల్‌ దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement