ఇప్పటి రాజకీయ ధోరణులకు సరిపోను
● అందుకే రాజకీయాలకు
దూరంగా ఉంటున్నా
● మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
సీతంపేట: వైజాగ్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ‘కాఫీ విత్ ఉండవల్లి అరుణ్ కుమార్’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని తన రాజకీయ ప్రస్థానం, అనుభవాలు, సమకాలీన అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పన్నెండేళ్లుగా తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఉండవల్లి స్పష్టం చేశారు. మారుతున్న ఇప్పటి రాజకీయ ధోరణులకు తాను సరిపోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఆధ్యాత్మిక అంశాలపై స్పందిస్తూ.. ‘హిందుత్వం అనేది కేవలం మతం కాదు, అది ఒక సనాతన ధర్మం. అది ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. మానవ జీవితంలో ఎదురయ్యే అన్ని ప్రశ్నలకు భగవద్గీతలో సమాధానాలు లభిస్తాయని ఆయన తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన రాజకీయ చాతుర్యం దేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. అలాగే మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ సేవలను కొనియాడుతూ, ఢిల్లీలో ఆయన అందరికీ అందుబాటులో ఉండేవారని, కులమతాలకు అతీతంగా ఎంతోమందికి రాజకీయ భిక్ష ప్రసాదించారని గుర్తుచేసుకున్నారు. బ్రాహ్మణులు రాజకీయంగా రాణించాలంటే తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో ద్రోణంరాజు శ్రీవాత్సవ, టీఎస్‌ఆర్ ప్రసాద్, చెరువు రామకోటయ్య, వేదుల హనుమంతరావు, కాళీ నరసింహం, కావూరి చరణ్ కుమార్, శ్రీరంగం దివాకర్, శంకర్ నీలు, నండూరి సుబ్రహ్మణ్యం, నరసింహమూర్తి, టీఎస్‌కే అరుణ్ కుమార్, రాచకొండ దశరథ రామయ్య తదితర బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు.


