గెడ్డ పొరబోకులో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
పట్టించుకోని అధికారులు
రోలుగుంట: మండలంలోని ఎం.కె.పట్నం రెవెన్యూ పరిధిలో గెడ్డ పొరంబోకు భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఎం.కె.పట్నం రెవెన్యూ పరిధి 121–3 సర్వే నంబర్‌లో వరాహ నదిని ఆనుకుని ఉన్న గెడ్డ పోరంబోకు భూమిలో గత నాలుగు రోజులుగా ప్లొకెయిన్‌తో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. పది నుంచి పదిహేను టాక్టర్ల లో లోడు చేసి గైరంపేట, బి.బి.పట్నం తదితర ప్రాంతాలకు తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. పగలురాత్రి తేడాలేకుండా మట్టి తవ్వకాలు, తరలింపు జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ సర్వే నంబరు పరిధిలో సుమారు 230 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. స్థానికంగా ఉండే కొంతమంది నాయకుల అండతోనే ఇంత దర్జాగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. టాక్టరు మట్టిలోడుకు రూ.700 నుంచి రూ.800 వరకూ వసూలు చేస్తున్నారు. వీఆర్వో వి.రాజులమ్మను సంప్రదించగా గెడ్డపోరంబోకులో తవ్వకాలు జరపకూడదని తెలిపారు. మట్టి తవ్వకాలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని తెలిపారు.


