రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
బుచ్చెయ్యపేట : మండలంలో గల దిబ్బిడి గ్రామానికి చెందిన కూలి పెదిరెడ్ల పోతురాజు(45) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 26వ తేదీన సబ్బవరం వద్ద వంగలి గ్రామంలో సరుగుడు తోట నరకడానికి ద్విచక్ర వాహనంపై పోతురాజు కూలి పనులకు వెళ్లాడు. అదే రోజు కూలి పనులు ముగించుకుని తిరిగి ఇంటికొస్తుండగా చోడవరం బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ వద్ద లారస్ కంపెనీ బస్సు ఢీకొంది. పోతురాజు కాళ్లపై నుంచి బస్సు వెళ్లడంతో ఆయన రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. విశాఖ కేజిహెచ్‌లో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం మృతి చెందాడు. కూలి పనుల కోసం వెళ్లిన పోతురాజు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


