గొల్లపేటలో కిడ్నీ వ్యాధిపై స్క్రీనింగ్‌ | - | Sakshi
Sakshi News home page

గొల్లపేటలో కిడ్నీ వ్యాధిపై స్క్రీనింగ్‌

Jan 4 2026 10:49 AM | Updated on Jan 4 2026 10:49 AM

గొల్ల

గొల్లపేటలో కిడ్నీ వ్యాధిపై స్క్రీనింగ్‌

కోటవురట్ల: జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గొల్లపేటలో కిడ్నీ వ్యాధిపై స్క్రీనింగ్‌ నిర్వహించినట్టు డిప్యూటీ డీఎంహెచ్‌వో వీరజ్యోతి తెలిపారు. కోటవురట్ల శివారు గొల్లపేటలో కె.వెంకటాపురం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఇక్కడ ఎక్కువగా కిడ్నీ కేసులు ఉన్నట్టు ఫిర్యాదు రావడంతో జిల్లా కలెక్టర్‌ వైద్య శిబిరం నిర్వహించి స్క్రీనింగ్‌ చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. గొల్లపేటలోని ప్రతి ఒక్కరి నుంచి రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయనున్నట్టు తెలిపారు. ప్రధానంగా లక్షణాలు ఉన్న వారికి ప్రిలిమినరీ పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేయనున్నట్టు తెలిపారు. గ్రామంలో 5 నుంచి 10 మంది కిడ్నీ వ్యాధి మొదటి స్టేజ్‌లో ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఇది ఎందుకు వచ్చిందనేది పరీక్షల ద్వారా నిర్ధారణ కానుందన్నారు. సాధారణంగా పేదలు పనిలోకి వెళ్లి అలసిపోయి నొప్పులు తగ్గేందుకు మందుల షాపులో మాత్రలు కొని వేసేసుకుంటారని ఇలా ఎక్కువగా వినియోగించడం వల్ల, నీళ్లు ఎక్కువ తాగకపోవడం వల్ల, యూరినల్‌ వ్యాధులు తదితర కారణాలతో కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందన్నారు. సమస్య వచ్చినపుడు పౌష్టికాహారం తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, నాన్‌వెజ్‌కు దూరంగా ఉండడం చేయాలన్నారు. రిపోర్ట్‌ వచ్చాక తదుపరి ఏం చర్యలు తీసుకోవాలో నిర్ధారణ చేస్తామని తెలిపారు. జెడ్పీటీసీ సిద్ధాబత్తుల ఉమాదేవి మాట్లాడుతూ గొల్లపేటలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించి జెడ్పీ సమావేశంలో సమస్యను లేవనెత్తినట్టు తెలిపారు. కలెక్టర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ఆమె వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నీటి పరీక్షలు చేశారని, అందులో సమస్య లేనట్టు గుర్తించారన్నారు. కె.వెంకటాపురం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ కిషోర్‌కుమార్‌ కూడా సిబ్బందితో వైద్య పరీక్షలు చేసి స్థానికులకు అవగాహన కల్పించారన్నారు. ఇంకేదైనా సమస్యపై ఈ వ్యాధి వస్తోందా? అన్న కోణంలో అన్ని పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి నుంచి డాక్టర్‌ లక్ష్మీశ్రీనివాస్‌, ఎంపీడీవో చంద్రశేఖర్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు సిద్ధాబత్తుల సత్యనారాయణ, ఉప సర్పంచ్‌ గవ్వా రాధాకృష్ణ, కార్యదర్శి రఘురాం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గొల్లపేటలో కిడ్నీ వ్యాధిపై స్క్రీనింగ్‌ 1
1/1

గొల్లపేటలో కిడ్నీ వ్యాధిపై స్క్రీనింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement