ప్రజల ముంగిటకే రెవెన్యూ సేవలు
తుమ్మపాల: రెవెన్యూ సేవలను ప్రజల ముంగిటకే అందజేస్తున్నామని, పట్టాదారు పాసుపుస్తకాలు నేరుగా రైతులకు గ్రామంలోనే పంపిణీ చేస్తున్నామని కలెక్టరు విజయ కృష్ణన్ తెలిపారు. అనకాపల్లి మండలం గోపాలపురంలో శుక్రవారం పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీ సర్వే జరిగిన 373 గ్రామాల్లో రైతులకు జారీ చేసిన 2,01,841 పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో కొత్త వాటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకూ అన్ని మండలాల్లో సచివాలయాల వద్ద షెడ్యూల్ ప్రకారం పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. రీసర్వేలో రికార్డుల తప్పులను సరిచేసి రైతులకు వారి భూములపై వివాదం లేని పూర్తి హక్కులు, భద్రత కల్పించడమే లక్ష్యంగా నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు రూపొందించినట్టు తెలిపారు. పాస్‌పుస్తకాల కోసం ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదని తెలిపారు. రెవెన్యూ సేవలన్నింటినీ గ్రామస్థాయిలోనే అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షేక్ ఆయేషా, స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


