అబ్బురపర్చిన మైరెన్ ఎగ్జిబిషన్
కె.కోటపాడు: సముద్రం అంటే విద్యార్థులకు ఎంతో ఇష్టం.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే వారికి సముద్రంతోపాటు అందులో దొరికే చేపలు, వేట విధానం వంటి విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయాలను వివరించేందుకు విశాఖపట్నంలోని భారతీయ మత్స్య పరిశోధన సంస్థ(ఎఫ్.ఎస్.ఐ) ఆధ్వర్యంలో శుక్రవారం కె.కోటపాడులోని వేణు విద్యానికేతన్ పాఠశాలలో మైరెన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులకు సంబంధిత సిబ్బంది అవగాహన కల్పించారు. తొలుత మైరెన్ ఎగ్జిబిషన్‌ను విశాఖపట్నం మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయ ముఖ్య అధికారి సి.ధనుంజయరావు, గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి భవాని ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌ను ఎ.కోడూరు హైస్కూల్, వేణు పాఠశాలల, సూర్యబాసర పాఠశాలలకు చెందిన 1,200 మంది విద్యార్థులు తిలకించి ఆశ్చర్యపోయారు. మత్స్య శాస్త్రవేత్త జి.వి.ఏ.ప్రసాదరావు పలు విషయాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రంలో వెయ్యి రకాలైన మత్స్య జాతులు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 1053 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంటే, విశాఖపట్నం జిల్లాలో 70 కిలోమీటర్లు ఉందని తెలిపారు. దేశంలో అతిపెద్ద ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నంలో ఉందన్నారు. విశాఖపట్నంలో ఎఫ్.ఎస్.ఐ ద్వారా సముద్రంలో చేపలపై ప్రతి నెలా 20 రోజుల పాటు సర్వే చేస్తున్నట్లు వివరించారు. సముద్రంలో ఎంత లోతులో ఏయే రకాల చేపలు ఉన్నాయో గుర్తిస్తామని వివరించారు. మత్స శిఖరి, మత్స్య దర్శిని అనే రెండు రకాల షిప్‌ల ద్వారా సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సర్వే సమయంలో దొరికే అరుదైన సముద్రపు చేపల జాతులను తీసుకువచ్చి మ్యూజియంలో భద్రపరుస్తున్నట్లు వివరించారు. షిప్‌ల్లో వెళ్లే సమయంలో అనుకోకుండా నీరు వచ్చినా, అగ్ని ప్రమాదం వంటి ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా సిబ్బంది లైఫ్ జాకెట్‌తోపాటు లైఫ్ బాయ్‌ను ధరించి ఏ విధంగాా ప్రాణాపాయం లేకుండా ఉండగలరో విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించారు. పర్యావరణ చేపల వేట పద్ధతితో పాటు సముద్ర అడుగు భాగపు మత్స్య వనరుల వేట, లాంగ్ లైన్ పద్ధతులను తెలిపారు. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను పడివేయడం వల్ల తాబేళ్లు మరణించే పరిస్థితులను వివిరించారు. మానవ జీవితం మనుగడకు ఆక్సిజన్ ఎంతో విలువైందన్నారు. ఈ ఆక్సిజన్ సముద్రం ద్వారా 80 శాతం వస్తే, కేవలం చెట్లు ద్వారా 20 శాతం వస్తుందని విద్యార్థులకు వివరించారు. మైరెన్ ఎగ్జిబిషన్‌లో చేపల వేటకు ఉపయోగించే వలలతో పాటు గేలాలను చూపించారు. కార్యక్రమంలో కెప్టెన్ వి.వి.ఎ.మూర్తి, రాముడు, ఈతా మురళీగణేష్, ఆనంద్, పంకజ్, బెవిన్ ప్రకాష్, వేణు విద్యా నికేతన్ డైరెక్టర్ బి.వి.ఎస్.వేణు, కె.కోటపాడు హైస్కూల్ హెచ్‌ఎం పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అబ్బురపర్చిన మైరెన్ ఎగ్జిబిషన్


