అక్రమ క్వారీపై విజిలెన్సు దాడి
సీజ్ చేసిన కంప్రెసర్‌ను తహసీల్దారు కార్యాలయంలో అప్పగింత
రోలుగుంట: మండలంలో అక్రమ క్వారీలుపై అందిన ఫిర్యాదు మేరకు విజయనగరం జిల్లాకు (మూడు జిల్లాలకు సంబంధించిన) విజిలెన్స్, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు సిబ్బంది శుక్రవారం దాడి చేశారు. కంప్రెసర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా వెదుళ్లవలస, కొవ్వూరు రెవెన్యూలో అక్రమ క్వారీ నిర్వహణపై గత వారంలో కొవ్వూరు గ్రామానికి చెందిన బంటు రాజు ఫిర్యాదు చేశాడు. ఇక్కడ బ్లాస్టింగు వల్ల సమీప గ్రామాల్లో ఇళ్లకు, పశువులకు, పంటలకు జరుగుతున్న నష్టాన్ని వివరించాడు. ఈ విషయాన్ని నిర్వాహకుడికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై అధికారులు స్పందించి దాడి చేశారు. ఆ సమయంలో లీజుదారుడు లేకపోవడం, కాలం చెల్లిన ముందుగుండు, కంప్రెసర్‌ను గుర్తించారు. ఫిర్యాదుదారుని, మరికొంత మందిని విచారణ చేశారు. సీజ్ చేసిన కంప్రెసర్‌ను తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించారు. ఈ విచారణలో వీఆర్వో ఎం.నాగమణి ఉన్నారు. తహసీల్దార్ ద్వారా సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు తదుపరి చర్యల కోసం నివేదిస్తామని డిప్యూటీ తహసీల్దార్ వి.శివ వివరించారు.


