కుక్కల దాడిలో 11 మందికి గాయాలు
రావికమతం: మండలంలోని కొత్తకోట మేజర్ పంచాయతీలో శుక్రవారం వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. వీటి దాడిలో కొత్తకోట, మర్రివలస, టి,అర్జాపురం గ్రామాలకు చెందిన 11 మంది గాయపడ్డారు. వీరిలో విద్యార్థులు, మహిళలు ఉన్నారు. మోదకొండమ్మ తల్లి గుడి రోడ్డు లైన్ నుంచి వెల్లంకి వారి వీధి వరకూ హల్‌చల్ చేశాయి. కొత్తకోట గ్రామానికి చెందిన వై.రాజేష్(13), జి.గోవింద్ (56), జి.వీరన్న (60), ఎం రత్నం (45), టి.అర్జాపురం గ్రామానికి చెందిన ఎం రామచందర్ (15)లను, మర్రివలస గ్రామానికి చెందిన బి. జనశ్రీ (9), ఎలిశెట్టి వరలక్ష్మి(45), పి. సునందకుమార్ (16), ఎ. రమణమ్మ (35), అమ్మిరెడ్డి కౌశిక్ (14) తదితరులపై దాడి చేసి గాయపర్చాయి. వీరిని వెంటనే కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. వీరిలో వీరన్న మినహా మిగిలిన వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరిలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గ్రామంలో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పంచాయతీ అధికారులు వీటి బెడద లేకుండా నిర్మూలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


