అశ్రునయనాలతో రాము మృతదేహం ఊరేగింపు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాము మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తున్న దృశ్యం
మునగపాక : రోడ్డు ప్రమాదంలో అశువులు బారిన యువకుడు మొల్లి రాము మృతదేహాన్ని గురువారం స్వగ్రామానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. మునగపాకకు చెందిన మొల్లి రాము అచ్యుతాపురం మండలం కొండకర్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గత నెల 31వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం అనకాపల్లి వందపడకల ఆసుపత్రి నుంచి గురువారం బైక్‌లపై ఊరేగింపుగా మునగపాకకు తీసుకువచ్చారు. అమర్ రహే రాము అంటూ స్నేహితులు, యువకులు నినాదాలు చేసుకుంటూ మృతదేహాన్ని స్థానిక శ్మశాన వాటికకు తరలించారు. అందరితో సరదాగా గడిపే రాము మృతితో మునగపాక శోక సముద్రంలో మునిగిపోయింది. చిన్న వయస్సులో జరగరాని ఘోరం జరిగిపోయిందని రాము కుటుంబానికి పలువురు సంతాపం తెలిపారు.


