
రామాలయానికి వేసిన తాళాలను చూపుతున్న సర్పంచ్ అప్పారావు
పరవాడ: కూటమి నేతలు గ్రామాల్లో అరాచకాలకు పాల్పడుతున్నారు. అందుకు అనకాపల్లి జిల్లా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామమైన వెన్నలపాలెం వేదికగా మారడం గమనార్హం. వినాయక చవితి వేడుకలు సందర్భంగా గ్రామంలోని రామాలయానికి కూటమి నాయకులు తాళాలు వేయడం వివాదానికి దారితీసింది. రామాలయంలో వినాయకుడిని నిలిపి సర్పంచ్ తొలిపూజ చేయడం ఆనవాయితీ.
ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీకి చెందిన గ్రామ సర్పంచ్ వెన్నల అప్పారావు తొలి పూజ చేసేందుకు భక్తులతో కలిసి బుధవారం ఉదయం 6 గంటలకు రామాలయానికి రాగా, అప్పటికే టీడీపీ నాయకులు ఆలయానికి తాళాలు వేసి వెళ్లడంతో అంతా అవాక్కయ్యారు. పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావుతో రామాలయాన్ని వెంటనే తెరిపించాలని వాగ్వావాదానికి దిగారు. టీడీపీ నాయకులకు పోలీసులు వంత పాడడంతో వారి అరాచకాలు, దాడులకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందని సర్పంచ్ అప్పారావు ఆరోపించారు. ఎట్టకేలకు సీఐ మల్లికార్జునరావు కల్పించుకుని తాళాలు తెరిపించి, సర్పంచ్ అప్పారావు దంపతులతో తొలిపూజలు జరిపించడంతో ఘర్షణ సద్దుమణిగింది.