
రోడ్డెక్కిన ఆటోడ్రైవర్లు
దేవరాపల్లి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో తమ ఉపాధికి గండి పడిదంటూ దేవరాపల్లిలో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. స్థానిక శివాలయం వద్ద ప్రధాన రోడ్డులో ఆటోలను నిలిపి వేసి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమ ఉపాధికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో నెలకు రూ.10 వేలు, రూ. 12 వేలు వేతనం తీసుకునే చిరు ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను అనర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా కల్పించారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏడాదికి రూ. 10 వేలు చొప్పున అందిస్తామని ప్రభుత్వం చెబుతుందని, తమ పిల్లల పాల ప్యాకెట్లకు కూడా ఇవి సరిపోవన్నారు. తమకు నెలకు రూ. 4 వేలు పింఛన్ రూపంలో అందజేసి ఆదుకోవాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో దేవరాపల్లి, నాగయ్యపేట, కాశీపురం, తామరబ్బ, గరిశింగి, తెనుగుపూడి, వాలాబు తదితర గ్రామాల డ్రైవర్లు పాల్గొన్నారు.