
సాగు భూములకు పట్టాలివ్వండి...
తుమ్మపాల : ఏళ్ల తరబడి వివిధ పంటలతో సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపి రైతు కూలీసంఘం ఆధ్వర్యంలో రోలుగుంట మండలం జేపీ అగ్రహారం రైతులు కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా చేశారు. తహసీల్దార్ కృష్ణమూర్తి అక్రమంగా రైతుల భూములపై ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని, ఆ తహసీల్దార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి, గేటు వద్ద ధర్నా చేపట్టారు. రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామంలో ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవిని రైతు ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేసి, సమస్యను వివరించారు. 1956 ఇనాముల రద్దు చట్టం, రైత్వారి కన్వర్షన్ ప్రకారం 1967లోనే గ్రామంలో సర్వే నెం.1 నుంచి 93 వరకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి రెవెన్యూ రికార్డుల్లో ఫారం–8 ఇచ్చారని, రైతుల భూమి శిస్తు చెల్లిస్తూ చేపడుతున్న క్రయవిక్రయాలను నిలిపివేసి ఇనాందారుల పేరుతో ప్రైవేటు వ్యక్తుల పేరున పట్టాలు మంజూరు చేయడం దారుణమని రైతు కూలీసంఘం (ఆంధ్ర ప్రదేశ్) జిల్లా కార్యదర్శి కోన మోహన్‌రావు అన్నారు. ఐదు తరాలుగా సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వని అధికారులు, అక్రమ పద్ధతిలో ఇనాం భూముల పేరుతో రికార్డులను తారుమారు చేసి ప్రైవేటు వ్యక్తులకు పట్టాలివ్వడం దుర్మార్గమన్నారు. రైతుల సాగులో ఉన్న భూములు ప్రైవేటు వ్యక్తుల పేరున పట్టాలు మంజూరు చేసిన అప్పటి తహసీల్దార్ పి.కృష్ణమూర్తిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే ప్రైవేట్ వ్యక్తుల పేరున ఇచ్చిన పట్టాలను రద్దుచేయాలన్నారు. రైతుల భూముల్లోకి ప్రైవేట్ వ్యక్తులు దౌర్జన్యంగా మంది మార్బలంతో వచ్చి రైతులపై దాడులు చేయడానికి, భూ ఆక్రమణకు చేస్తున్న ప్రయత్నాలను అరికట్టాలని కోరారు. రైతు నాయకులు రొంగలి రమణ, డి.బుచ్చిరాజు,దుంగల శంకరరావు, పెట్ల సత్యనారాయణ మాట్లాడుతూ జేపీ అగ్రహారం భూ సమస్యను పరిష్కరించాలని అనేకసార్లు ఎమ్మార్వో,ఆర్డీవో, జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా తగిన చర్యలు తీసుకోవట్లేదని, సాగులో లేని వ్యక్తికి పట్టాలు చేసారని, దీనిలో స్థానిక ఎమ్మార్వో అమ్ముడుపోయారన్నారు. ఈ కార్యక్రమంలో నవయువ సమాఖ్య రాష్ట్ర నాయకులు నందారపు భాస్కరరావు, రైతు కూలీ సంఘం సభ్యులు మరిసా నరేష్, గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు.