
జైబోలో గణేష్ మహరాజ్‌కి జై
కంబాల జోగులుకు లక్ష్మీగణపతి చిత్రపటం అందిస్తున్న ఆలయ అధికారులు
స్వామిని దర్శించుకునేందుకు క్యూలో వేచి ఉన్న భక్తులు
నక్కపల్లి: జైబోలో గణేష్ మహరాజ్‌కి జై అంటూ వినాయక చవితి పండగను బుధవారం భక్తులు వాడవాడలా ఘనంగా జరుపుకొన్నారు. ఒడ్డిమెట్ట లక్ష్మీగణపతి ఆలయంలో చవితి వేడుకల కోసం దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. నక్కపల్లి మండల ప్రజలతో పాటు, అడ్డురోడ్డు, పాయకరావుపేట, యలమంచిలి, తుని, నర్సిపట్నం తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఒడ్డిమెట్ట గణపయ్యను దర్శించుకున్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ పైలా నూకన్న నాయకుడు ఆధ్వర్యంలో దేవదాయ శాఖ అధికారులు ఉచిత దర్శనాలతో పాటు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కూడా కల్పించారు. సాయంత్రం ఇక్కడ పెద్ద ఎత్తున తిరునాళ్లు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. స్వామిని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామికి 10 కిలోల లడ్డూలను సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. నక్కపల్లి సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబు, ఈవో కిరణ్మయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.
పసుపు అలంకరణలో చోడవరం విఘ్నేశ్వరుడు
చోడవరం: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య ఆదిదేవుడు చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరస్వామికి చవితి పూజలు బుధవారం కనుల పండువగా జరిగాయి. వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. జై గణేష్ నామస్మరణతో మార్మోగింది. ఉత్సవాలను ఎమ్మెల్యే రాజు ప్రారంభించారు. స్వామివారికి పాలు, తేనె, నెయ్యితో అభిషేకాలు చేశారు. ఆలయంలో లక్ష్మీగణపతి హోమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారి తిరువీధోత్సవం ఘనంగా జరిగింది. దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి, కమిటీ చైర్మన్ పసుమర్తి సాంబతోపాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక విద్యుత్ అలంకరణతో ఆలయ ప్రాంగణం కనువిందు చేసింది. చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి, భరత నాట్యాలు, వేంకటేశ్వరస్వామి భజన మండలి మహిళా బృందం వేసిన కోలాటకం ఆకట్టుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం శ్రీస్వయంభూ విఘ్నేశ్వరస్వామి పసుపు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

జైబోలో గణేష్ మహరాజ్‌కి జై

జైబోలో గణేష్ మహరాజ్‌కి జై

జైబోలో గణేష్ మహరాజ్‌కి జై