బదిలీలు సరే... జీతాలెప్పుడో..! | - | Sakshi
Sakshi News home page

బదిలీలు సరే... జీతాలెప్పుడో..!

Aug 13 2025 5:34 AM | Updated on Aug 13 2025 5:34 AM

బదిలీ

బదిలీలు సరే... జీతాలెప్పుడో..!

● టీచర్లు, రెవెన్యూ ఉద్యోగులకు అందని వేతనాలు ● టీచర్లకు ఐడీ కేటాయింపుల్లో జాప్యం ● రెండు నెలలుగా జీతాల్లేవు.. మూడో నెలా అదే పరిస్థితి ● జిల్లాలో 3 వేలకు పైగా రెవెన్యూ ఉద్యోగులు, టీచర్లు, సిబ్బంది ఎదురుచూపులు

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలంలోనే ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం చవిచూస్తోంది. ఇటీవల రెండు నెలల క్రితం ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన జరిగిన సాధారణ బదిలీల్లో స్థాన చలనమైన ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులకు కూటమి సర్కార్‌ జీతాల విషయంలో చుక్కలు చూపిస్తోంది. బదిలీల ప్రక్రియ ముగిసి విధుల్లో చేరి రెండు నెలలు పూర్తయి..మూడో నెల కూడా సగమైంది. జీతాలు మాత్రం చెల్లించకుండా ప్రభుత్వం అవస్ధలపాలు చేస్తోంది.

సాక్షి, అనకాపల్లి : జూన్‌ నెలలో జీతం రాలేదు..జులైలో జీతం రాలేదు. ఆగస్టు నెల అయినా జీతం వస్తుందా..అని వేలాది మంది టీచర్లు, రెవెన్యూ ఉద్యోగులు సిబ్బంది ఎదురు చూపులు చూస్తున్నారు? బదిలీలను సాకుగా చూపి ప్రభుత్వం జీతాలను చెల్లించకుండా కాలయాపన చేస్తోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్‌ నిర్లక్ష్యంతో పాటు విద్యా, ట్రెజరీ శాఖల సమన్వయ లోపంతోనే ఉపాధ్యాయులకు ఈ పరిస్థితి దాపురించింది. తమ జీతాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం, అధికారులు ఆలసత్వం ప్రదర్శిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

బదిలీలు పూర్తయినా..సమస్యలు అలాగే...

సాధరణ బదిలీల్లో ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులకు భారీగా బదిలీలు జరిగాయి. రెవెన్యూలో ఉమ్మడి విశాఖ జిల్లా స్దాయిలో తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంటు, వీఆర్‌వోలకు బదిలీలు జరిగాయి. ఈ బదిలీలు ప్రక్రియ పూర్తయినా..అక్కడక్కడా డిప్యూటేషన్‌ సమస్యలు ఇప్పుటికీ కొనసాగుతున్నాయి. నిషేధం ఎత్తి వేసిన తర్వాత కూడా బదిలీలను జిల్లా కలెక్టర్‌ కొనసాగిస్తున్నారు. ప్రతి ఉద్యోగికి జూన్‌, జులై, ఆగస్టు మాసాల్లో ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూలు ఫీజులు, ఇతర విద్యా సామాగ్రి కోసం వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బదిలీలు జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు, కొత్త ఇంటి అడ్వాన్సులు, ఇంటి అద్దెల రూపంలో మరింత ఖర్చు పెరుగుతుంది. వీటిన్నింటికి తోడు జీతాలు సకాలంలో రాకపోవడంతో నెలసరి ఈఎంఐల చెక్కు బౌన్సులు, పర్సనల్‌ లోన్స్‌, హౌసింగ్‌ లోన్‌ వంటి చెక్‌ బెన్సులు అవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల కారణంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పరిస్ధితి ఇంత దారుణంగా ఉంది. ఉపాధ్యాయుల బదిలీలు జూన్‌ 15వ తేదీ నాటికి అన్ని పూర్తయ్యాయి. అయితే ఇప్పటికీ అనేక మంది ఉపాధ్యాయులకు పోజిషన్‌ ఐడీలు కేటాయించలేదని తెలుస్తోంది. దీంతో జూన్‌ నెలకు సంబంధించిన జులై నెల జీతాలు ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు అందలేదు. అలాగే జులై నెలకు సంబంధించిన జీతాలు ఆగస్టు మొదటి వారంలో అందుకునే అవకాశం లేదని తెలుస్తోంది.

త్వరితగతిన జీతాలు వేయాలి

బదిలీ అయిన ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు సొంత ప్రాంతం నుంచి వారి కుటుంబాలతో వెళ్లారు. రవాణా ఖర్చులు, ఇంటి అద్దె, అడ్వాన్స్‌ రూపంలో ఎక్కువగా ఖర్చు పెట్టారు. మరోవైపు జూన్‌ నెలల్లోనే బదిలీలు అవ్వడంతో కావడంతో పిల్లల స్కూలు ఫీజు, విద్యార్థులకు పుస్తకాలు, ఇతర ఖర్చులు ఎక్కువయ్యాయి. ఈ పరిస్దితుల్లో జీతాలు అందకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు చొరవ చూపించి త్వరితగతిన జీతాలు వచ్చేలా చేయాలని కోరుతున్నాను.

– టి.ఆర్‌.అంబేద్కర్‌, యూటీఎఫ్‌ జిల్లా సెక్రెటరీ

బదిలీలు సరే... జీతాలెప్పుడో..! 1
1/1

బదిలీలు సరే... జీతాలెప్పుడో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement