
సుంకాల ఉచ్చులో రొయ్య
కుదేలైన ఆక్వా రంగం
● తగ్గిన రొయ్యల ఎగుమతులు ● ఇప్పటికే పతనమైన ధరలు ● భరోసా ఇవ్వని కూటమి ప్రభుత్వం
మహారాణిపేట: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి రాజసం తెచ్చిపెట్టి, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెట్టిన బంగారు రొయ్య.. నేడు అమెరికా వాణిజ్య విధానాల కారణంగా తన ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది. దేశ రొయ్యల ఉత్పత్తిలో అగ్రగామిగా.. ఆక్వా హబ్‌గా వెలుగొందుతున్న ఆంధ్రప్రదేశ్.. ముఖ్యంగా విశాఖ తీరం, మునుపెన్నడూ లేని సంక్షోభంలో చిక్కుకుంది. భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం సుంకాన్ని విధించడంతో.. అంతర్జాతీయ మార్కెట్‌లో మన రొయ్యల పోటీ సామర్థ్యం దెబ్బతింది. ఫలితంగా ధరలు రికార్డు స్థాయిలో పతనం కావడం, ఎగుమతులు నిలిచిపోవడంతో లక్షలాది మంది ఆక్వా రైతులు, మత్స్యకారులు, పరిశ్రమ కార్మికుల భవిష్యత్తు అంధకారంలోకి జారుకుంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోకపోతే, ఈ సంక్షోభం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన, దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపడం ఖాయం.
కుప్పకూలిన ధరలు..
భారత రొయ్యల ఉత్పత్తులపై అమెరికా ఏకపక్షంగా 25 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించడమే ఈ సంక్షోభానికి మూల కారణం. ఇదే సమయంలో, ఈక్వెడార్ వంటి పోటీ దేశాలపై కేవలం 10 శాతం సుంకం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో భారత రొయ్యలకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా ఎగుమతులు ఒక్కసారిగా నిలిచిపోయి, స్థానిక మార్కెట్‌లో ధరలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. గతంలో 100 కౌంట్ రొయ్యల ధర రూ. 270 పలకగా, ఇప్పుడు అది రూ. 230కి పడిపోయింది. ఈ ధరల పతనంతో రైతులు టన్నుకు రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు నష్టపోతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు కూలిపోవడంతో, పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితిని ఆసరాగా చేసుకున్న స్థానిక వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
ఈ గండం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని రైతులు, మత్స్యకారులు, పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ‘కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమెరికాతో దౌత్య, వాణిజ్యపరమైన చర్చలు జరిపి, సుంకాలను తగ్గించేలా లేదా పూర్తిగా తొలగించేలా ఒత్తిడి తీసుకురావాలి. నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలి. టన్నుకు కనీస మద్దతు ధర ప్రకటించడం లేదా నష్టపరిహారం అందించడం వంటి చర్యలు చేపట్టాలి. విద్యుత్, రొయ్యల మేత వంటి కీలకమైన వాటిపై సబ్సిడీలను పెంచి, సాగు వ్యయాన్ని తగ్గించాలి. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించి.. యూరప్, ఇతర ఆసియా దేశాల్లో కొత్త మార్కెట్లను అన్వేషించడానికి ఎగుమతిదారులకు ప్రభుత్వం ప్రోత్సాహం, సహకారం అందించాలి.’అని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే.. రాబోయే సీజన్‌లో రొయ్యల సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరిశ్రమ భవిష్యత్తును మరింత ప్రమాదంలోకి నెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరిశ్రమపై ప్రభావం
ఈ సంక్షోభం కేవలం రైతులకే పరిమితం కాలేదు. దీని ప్రభావం మొత్తం సరఫరా గొలుసుపై పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 100–150 ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు, ముఖ్యంగా విశాఖ పరిసర ప్రాంతాల్లోని 15 ఫ్యాక్టరీలు ఎగుమతి ఆర్డర్లు లేక ఉత్పత్తిని భారీగా తగ్గించాయి. దీనివల్ల వేలాది మంది కార్మికులు, ముఖ్యంగా మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. రొయ్యల మేత, మందుల సరఫరాదారులు, ప్యాకేజింగ్ పరిశ్రమలు, రవాణా రంగం కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఏడాదికి రూ. 25వేల కోట్ల విలువైన రొయ్యలను ఎగుమతి చేసే ఈ కీలక రంగం కుదేలవడం రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగిస్తోంది.

సుంకాల ఉచ్చులో రొయ్య