గోవాడ సుగర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గోవాడ సుగర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలి

Aug 10 2025 5:45 AM | Updated on Aug 10 2025 5:45 AM

గోవాడ సుగర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలి

గోవాడ సుగర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలి

చోడవరం: గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ మనుగడను కాపాడేందుకు నేరుగా సభ్య రైతులే ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ కార్మికులు, ఏపీ రైతు సంఘాలు వారికి మద్దతుగా నిలిచారు. ఈ ఏడాది క్రషింగ్‌ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్న సభ్యరైతులు ఆందోళన చెందుతూ తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలని ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేశారు. 2024–25 క్రషింగ్‌ సీజన్‌లో ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం చేయకపోవడం వల్ల ఫ్యాక్టరీ పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. గతేడాదికి సంబంధించిన చెరకు బకాయిలు నేటికీ చెల్లించలేదు. అంతేకాకుండా ఈ ఏడాది క్రషింగ్‌ చేస్తారో లేదో తెలియని అగమ్యగోచరంగా ఉంది. దీనితో ఆందోళన చెందిన రైతులంతా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆందోళన ఉధృతం అవుతుందని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రైతులు మాత్రం శాంతియుతంగానే తమ డిమాండ్లను తెలుపుతూ ఆందోళన చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్యాక్టరీలో పరిపాలన భవనం వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం చేయాలని, ఈ ఏడాది క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభించాలని, అందుకు కావలసిన ఫ్యాక్టరీ ఓవరాయిలింగ్‌ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 2025–26లో రానున్న క్రషింగ్‌ సీజన్‌కు వర్కింగ్‌ క్యాపిటల్‌ నిమిత్తం, ప్రస్తుతం రైతులకు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడానికి అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీలకు అతీతంగా రైతులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, ఏపీ రైతు సంఘం, ఏపీ చెరకు రైతు సంఘ నాయకులు పాల్గొని మద్దతు పలికారు.

కూటమి సర్కారు కపట నీతి

ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులందరిపై ఉందని మాజీ సీడీసీ చైర్మన్‌ సుంకర శ్రీనివాసరావు, ఫ్యాక్టరీ మాజీ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శరగడం రామునాయుడు, రాయి సూరిబాబు, మాజీ సర్పంచ్‌ పల్లేల వరహాలబాబు అన్నారు. ఎన్నికల ముందు ఫ్యాక్టరీని ఆదుకొని రైతులకు గిటుబాటు ధర కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ ఇప్పుడు ఎందుకు ఫ్యాక్టరీని ఆదుకోలేదని వారు ప్రశ్నించారు. చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ ఎన్ని ముందు హామీ ఇచ్చి ఇప్పుడు ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారని చెరకు రైతులంతా ముక్తకంఠంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేయాలని, ముందుగా ఈనెల 11వ తేదీన కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులు నిర్ణయించారు. ప్రజా, రైతు సంఘాల నాయకులు శ్రీనివాసరావు, నందారపు భాస్కరరావు, ఎస్వీనాయుడు, ఏడువాక శ్రీనివాసరావు, జగదీష్‌, దండుపాటి తాతారావు,శరగడం అప్పారావు, పీలా రమణ, కొణతాల గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వచ్చే క్రషింగ్‌ సీజన్‌కు అవసరమైన గ్రాంటు ఇవ్వాలి

రైతులు, కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి

ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగిన చెరకు రైతులు

11న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నాకు నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement