
పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్యాయత్నం’
డాబాగార్డెన్స్: పోలీసుల వేధింపుల కారణంగానే తన కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశాడని బుచ్చెయ్యపేట మండలం ఐతంపూడి గ్రామానికి చెందిన ముచ్చకర్ల మహాలక్ష్మినాయుడు ఆరోపించారు. కేజీహెచ్‌లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన కుమారుడు కృష్ణమూర్తికి ఏ పాపం తెలియదన్నారు. మూడు నెలల కిందట గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు అన్యాయంగా ఇరికించి జైలుకు పంపించారని వాపోయాడు. బెయిల్‌పై వచ్చిన కృష్ణమూర్తి, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన తగాదాలను దృష్టిలో పెట్టుకుని తనను అన్యాయంగా ఇరికించినట్లు ముచ్చకర్ల శివతో ఫోన్లో మాట్లాడాడని చెప్పారు. గ్రామంలో మాట్లాడుకుందామని చెప్పినప్పటికీ శివ తన పలుకుబడితో పోలీసులకు ఫిర్యాదు చేశాడని, దీంతో పోలీసులు తన కుమారుడ్ని మళ్లీ స్టేషన్‌కు పిలవడంతో భయంతో ఆత్మహత్యకు యత్నించాడని సాక్షికి మహాలక్ష్మినాయుడు తెలిపారు. తమకు న్యాయం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆయన కోరారు.