
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో మత్స్యకారులకు భారీ సొర చేప చిక్కింది. 500 కిలోల బరువైన సొరను చూసి మత్స్యకారులు సైతం షాకయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి.. సొర చేపను తీరానికి లాక్కొచ్చినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా పూడిమడక తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల గాలానికి శనివారం భారీ సొర చేప చిక్కింది. 15 అడుగుల పొడవు, 500 కిలోల బరువైన సొరను చూసి తొలుత మత్స్యకారులు భయపడ్డారు. అనంతరం, మత్స్యకారులు ఐదు గంటలపాటు కష్టపడి తీరానికి లాక్కొచ్చారు. ముందుగా సొరను దగ్గరికి లాగి బల్లేలతో పొడిచారు. పడవలోకి చేర్చలేక అలాగే తాడుతో కట్టి.. లాక్కొచ్చారు. పూడిమడక తీరంలో ఇప్పటి వరకూ చూడలేదని స్థానికులు తెలిపారు. దీన్ని వేలం వేయగా రూ.34 వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు తెలిపారు. ఇంత పెద్ద సొర చేప మత్స్యకారులకు చిక్కడంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.