
మేమూ గిరిజనులమే..
చీడికాడ: జిల్లాలోని 8 మండలాల్లో గిరిజనులు నివసిస్తున్నారని, వారికి ఏజెన్సీవాసుల వలె విద్య, వైద్యం తదితర రంగాల్లో సంక్షేమ పథకాలు అందజేయాలని పలు గిరిజన సంఘాల నేతలు కోరారు. కోనాంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, సుందరపు విజయకుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు సంఘాలకు చెందిన గిరిజన నేతలు ఇరటా నర్సింహమూర్తి, ఎం.కొండలరావులు మాట్లాడుతూ మైదాన ప్రాంత గిరిజనులు ఎలాంటి ఆధారం లేక నిరుపేదలుగానే మిగిలిపోతున్నారని, 1/70 యాక్టును అమలు చేయాలని కోరారు. నాన్ షెడ్యూల్‌లో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్‌లో కలిపి ఏజెన్సీ గిరిజనులకు అందుతున్న అన్ని చట్టాలు, సౌకర్యాలను మైదాన గిరిజన ప్రజలకు అందేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే బండారు హామీ ఇచ్చారు. 1/70 యాక్టు మండలాలకు వర్తింప చేస్తే మిగిలిన గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బంది పడతారని, మండలం యూనిట్ గా కాకుండా గిరిజనులు ఉన్న పంచాయతీలకు వర్తింప చేసేలా కృషి చేస్తామన్నారు. గిరిజనులకు ప్రత్యేకించి పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ఏర్పాటు చెయ్యాలని కోరగా నెలలో ఒకరోజు నర్సిపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కోనాం నుంచి వాలాబుకు (దేవరాపల్లి) రోడ్డు వేయాలని కోరగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే రూ 2.15 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశామని, అనుమతులు రాగానే రోడ్డు పూర్తి చేస్తామన్నా రు. జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గిరిజన ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టుతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్ర మాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థినుల థింసా నృత్యంలో కలెక్టర్ విజయ కృష్ణన్, మాడుగుల ఎమ్మె ల్యే బండారు పాదం కలిపారు. ఈ సందర్భంగా డి–వార్మింగ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, అధికారులకు మెమెంటో లు అందించారు. ఎంపీపీ తాళ్లపురెడ్డి రాజారాం, వైస్ ఎంపీపీ కిముడు చిన్నమ్మలు, సర్పంచ్ సలుగు ఈశ్వరమ్మ, మండల ప్రత్యేకాధికారి మూర్తి, తహసీల్దార్ లింకన్, ఎంపీడీవో హేమసుందరరావు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు అందించాలనిమెదాన ప్రాంత అడవి బిడ్డల వినతి
కోనాంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
థింసా నృత్యం చేసిన కలెక్టర్

మేమూ గిరిజనులమే..