అచ్యుతాపురం కూడలిలో ట్రాఫిక్ కష్టాలు
● ఫ్లై–ఓవర్ నిర్మాణ పనులతో సమస్యలు ● ప్రత్యామ్నాయ రహదారులు లేక ట్రాఫిక్ ఇక్కట్లు ● అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం
అచ్యుతాపురం రూరల్ : సెజ్ కర్మాగారాల నుంచి వచ్చే భారీ వాహనాలను అచ్యుతాపురం పాత సినిమా హాల్ పక్క నుంచి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లే మార్గంలో మళ్లించడం వల్ల బుధవారం ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అచ్యుతాపురం కూడలిలో ఫ్లై–ఓవర్ నిర్మించడానికి ఏర్పాటు చేసిన భారీ యంత్రం కారణంగా అటువైపు వాహనాలు రాకపోకలు చేయడానికి వీలుకాలేదు. ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పరిశ్రమలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే కార్మికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
సరైన ప్రణాళిక లేకుండా...
ఫ్లై–ఓవర్ నిర్మాణంలో నిర్వాహకులకు సరైన అవగాహన లేకపోవడం కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు అంటున్నారు. ట్రాఫిక్‌ని మళ్లించకుండా ఫ్లై–ఓవర్ నిర్మాణం పనులు చేపడితే వచ్చే సమస్యలను గ్రహించలేకపోవడం అధికారులు, నాయకుల తెలివితక్కువ తనంగా భావిస్తున్నారు. ఆ మాత్రం అవగాహన లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం పిచ్చికి పరాకాష్టగా ఉందని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర సమయాల్లో ఎలా...!
ఆరంభంలోనే ఇంతటి ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటే మున్ముందు మరెన్ని ఇబ్బందులు పడాలోనని జనం వాపోతున్నారు. ఇటువంటి ట్రాఫిక్ సమస్యలు ఎదురైతే అత్యవసరంగా పరిశ్రమల్లో కానీ స్థానిక నివాసాల్లో గానీ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు వెళ్లేందుకు కూడా వీలులేనంత ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది. ముందస్తు ఆలోచన లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే అభివృద్ధి కార్యక్రమాల కారణంగా అనేక మంది అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అధికారులకు ఫ్లై–ఓవర్ నిర్మాణంలో ట్రాఫిక్‌ని మళ్లించే విధానం సరికాదని తెలిసినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితిలో నోరు మెదపలేకున్నామని అంటున్నారు. కొందరి స్వార్థ పూరిత ఆలోచనల కారణంగా సామాన్య పౌరులు సమస్యల పాలౌతున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, నాయకులు మంచి ఆలోచనతో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ముందుగా ఫ్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేసి వాహనాలను మల్లించి అనంతరం అవసరమైతే అప్పుడు ఫై–ఓవర్ నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
అచ్యుతాపురం కూడలిలో ట్రాఫిక్ కష్టాలు
అచ్యుతాపురం కూడలిలో ట్రాఫిక్ కష్టాలు


