
విశాఖ తరహాలో పాయకరావుపేట అభివృద్ధికి కృషి
పాయకరావుపేట: రానున్న పదేళ్లలో పాయకరావుపేటను విశాఖ, గాజువాక తరహాలో అభివృద్ధి చేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పాయకరావుపేటలోని పంచాయతీరాజ్ అతిథిగృహంలో ఆమె శుక్రవారం నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా జ్యోతీరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి అనిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో అత్యధిక వనరులు ఉన్న నియోజకవర్గం పాయకరావుపేట అని చెప్పారు. నియోజకవర్గానికి బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ వంటి ప్రధాన పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. గత ఐదేళ్ల పాలనను ఆమె విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును జీవనాడిగా పేర్కొంటూ పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. త్వరలో ఇంటింటికి కుళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నిమని ఆమె తెలిపారు.
హోమ్ మంత్రి విలేజ్ వాక్
నక్కపల్లి: మండలంలో వేంపాడులో శుక్రవారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విలేజ్ వాక్ నిర్వహించారు. ఉదయాన్నే ఆమె గ్రామంలో పలు వీధుల్లో పర్యటించారు. స్వయంగా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు తాగునీరు, కాలువలు, రోడ్ల సమస్యలను వివరించారు. తాగునీటి ఎద్దడి ఉందని పరిష్కరించాలని కోరారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.