
నాణ్యమైన విత్తనాలతో ఆశించిన దిగుబడులు
ఏడీఆర్ డా.పీవీకే జగన్నాథరావు
అనకాపల్లి: నాణ్యమైన విత్తనాలతో రాబోవు ఖరీఫ్ సీజన్లో ఆశాజనకమైన దిగుబడులు సాధించవచ్చని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ పీవీకే జగన్నాథరావు అన్నారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో సోమవారం టీ అండ్ వీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మే నెలలో ఇప్పటి వరకు జిల్లాలో 60 శాతం వర్షపాతం నమోదయిందన్నారు. ఈ వర్షాన్ని ఉపయోగించుకుని రైతులు జనుము, జీలుగ, పిల్లి పెసర, పచ్చిరొట్ట పంటలను పెంచి ఖరీప్ సాగుకు నేలలో కలియదున్నుట ద్వారా నేల ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. దీంతోపాటు ఖరీఫ్‌లో ఆశించిన దిగుబడులను పొందవచ్చన్నారు. జిల్లాలో రైతులకు కావలసిన విత్తనాలు ఆర్‌ఏఆర్‌ఎస్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. చెరకు విత్తనాలు(2012ఎ 319, 2010 ఎ 226, 2006ఎ), వరిలో ఆర్‌జేఎల్ 2537, ఎంటీయూ 1318 రకాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహనరావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలు సాగుకు ఎంతో మేలు చేశాయన్నారు. ఈ నెల 26 నాటికి పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే ఆర్బీకే సిబ్బంది, వీఏఏలకు వివిధ పంటలు, బయో ఫెర్టిలైజర్స్, విత్తనాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కేవీకే కొందెంపూడి ప్రొగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ రాజకుమార్ మాట్లాడుతూ ఆర్‌జేఎల్ 2537, ఎంటీయూ 1121 రకాలు, నువ్వులలో వైఎల్‌ఎం 66, సజ్జలో ఏబీవీ–04, కొర్లలో సూర్యనంద రకాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.