సాక్షి, పాడేరు: మన్యంలో పల్లె పీఠాల కోసం పోరు రసవత్తరంగా మారింది. ఏకగ్రీవాల కంటే ఎన్నికల బరిలో తలపడే అభ్యర్థులే అధికంగా ఉండటంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. తొలి విడతలో కొయ్యూరు, చింతపల్లి, జి.కే.వీధి మండలాల్లోని 66 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఒక్క పంచాయతీ మాత్రమే ఏకగ్రీవమైంది. దీంతో మిగిలిన 65 పంచాయతీల్లో గురువారం ఓటర్ల తీర్పు వెలువడనుంది.
ఒక్కచోటే ఏకగ్రీవం.. మిగతా అంతటా పోరు!
కొయ్యూరు మండలంలోని 33 పంచాయతీల్లో బాలారం ఒక్కటే ఏకగ్రీవమైంది. మిగిలిన 32 పంచాయతీల్లో సర్పంచ్ పదవుల కోసం 93 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. గూడెంకొత్తవీధిలోని 16 పంచాయతీలకు 79 మంది, చింతపల్లిలోని 17 పంచాయతీలకు 96 మంది బరిలో నిలిచారు. మొత్తంగా మూడు మండలాల్లోని 65 పంచాయతీల్లో 268 మంది అభ్యర్థులు సర్పంచ్ పీఠాల కోసం పోటీపడుతున్నారు. వైఎస్సార్‌సీపీ, కూటమి పార్టీల మద్దతుదారులతోపాటు కాంగ్రెస్, వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
వార్డుల్లోనూ తగ్గని హీట్
గ్రామాల్లో సర్పంచ్ పదవులతోపాటు వార్డు సభ్యుల స్థానాలకూ గట్టి పోటీ నెలకొంది. మూడు మండలాల్లో మొత్తం 686 వార్డు స్థానాలకు గాను 132 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జి.కే.వీధిలో 188 వార్డులకు 29 ఏకగ్రీవం కాగా, 159 స్థానాల్లో 390 మంది పోటీలో ఉన్నారు. కొయ్యూరులో 294 వార్డులకు 47 ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాల్లో 546 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చింతపల్లిలో 204 వార్డులకు 56 ఏకగ్రీవం కాగా, 148 స్థానాల్లో 394 మంది పోటీపడుతున్నారు.
పోలింగ్‌కు సర్వం సిద్ధం
తొలి విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిశాంతి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 65 పంచాయతీలు, వార్డు సభ్యుల ఎన్నికల కోసం పోలింగ్ సామగ్రి, సిబ్బందిని కేంద్రాలకు తరలించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను పోలీసు భద్రత నడుమ పోలింగ్ కేంద్రాలకు చేర్చారు. ఎన్నికల విధుల కోసం ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను వినియోగిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సాయంత్రం నుంచే వార్డు సభ్యులు, సర్పంచ్ స్థానాల విజేతలను ప్రకటించనున్నారు.
పల్లె ఓటరు తీర్పుపై ఉత్కంఠ
మూడు మండలాల్లోనూ ఏకగ్రీవాల కంటే పోటీ జరిగే స్థానాలే ఎక్కువగా ఉండటంతో గ్రామాల్లో ఎన్నికల వేడి కనిపిస్తోంది. ప్రచార పర్వం ముగిసి పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యలు, అభ్యర్థుల హామీల నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.
మన్యంలో ఎన్నికల సమరం..ఏకగ్రీవం ఒక్కటే
65 పంచాయతీల్లోసర్పంచ్ అభ్యర్థుల హోరాహోరీ
686 వార్డుల్లోనూ రాజకీయ సందడి
నేడు గూడెంకొత్తవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో పోలింగ్
మండలాల వారీగా..
గూడెంకొత్తవీధిలో మొత్తం వార్డులు : 188 ఏకగ్రీవం : 29 పోటీ : 159
కొయ్యూరులో మొత్తం వార్డులు : 294 ఏకగ్రీవం : 47 పోటీ : 246
చింతపల్లిలో మొత్తం వార్డులు : 204 ఏకగ్రీవం : 56 పోటీ : 148


