ప్రజాస్వామ్య పండగకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య పండగకు సిద్ధం

Nov 26 2026 12:18 AM | Updated on Nov 26 2026 12:18 AM

సీలేరు: ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం.. గంజాయి కార్యకలాపాలకు కేంద్రంగా పేరొందిన ఆంధ్ర–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలోని గుమ్మరేవుల పంచాయతీలో ఇప్పుడు ప్రజాస్వామ్య పండుగకు రంగం సిద్ధమైంది. దశాబ్దాలుగా భద్రతాపరమైన కారణాలతో పంచాయతీ కేంద్రంలో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉండేది. అలాంటిది ఈసారి తొలిసారిగా గుమ్మరేవుల పంచాయతీ సచివాలయం వద్దే సర్పంచ్‌ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకప్పుడు ఎన్నికల సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి తిరిగి రావాలన్నా, పోలింగ్‌ సజావుగా సాగాలన్నా పోలీసులకు, అధికారులకు తీవ్ర ఆందోళన ఉండేది. మావోయిస్టుల ప్రాబల్యం కారణంగా గుమ్మరేవులలో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్‌గా మారేది. దీంతో పంచాయతీ కేంద్రంలో పోలింగ్‌ నిర్వహించకుండా ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ చేపట్టేవారు.

అప్పుడు మాదిగమల్లు..

ఇప్పుడు గుమ్మరేవుల!

2014లో జరిగిన అసెంబ్లీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలను సైతం దారకొండ సమీపంలోని మాదిగమల్లు ప్రాంతంలో నిర్వహించారు. అయితే కాలక్రమేణా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. గత ఐదేళ్లలో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గడం, వారి సంఖ్యాబలం క్షీణించడం, రహదారులు, సెల్‌ఫోన్‌ టవర్ల నిర్మాణంతో మారుమూల ప్రాంతాలకు రాకపోకలు సులభతరమయ్యాయి. ప్రస్తుతం భద్రతాపరమైన ముప్పు తగ్గడంతో ఈసారి గుమ్మరేవుల పంచాయతీ కేంద్రంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎన్నికల సిబ్బంది ఇప్పటికే అక్కడికి చేరుకుని బస చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించేందుకు పోలీస్‌, ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో ప్రాణభయంతో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉండగా, ఇప్పుడు అదే ప్రాంతంలో సిబ్బంది స్వేచ్ఛగా ఎన్నికల విధులకు సిద్ధమవడం గమనార్హం.

వైఎస్సార్‌సీపీ హయాంలో అభివృద్ధి పనులు

ఒకప్పుడు సరైన రహదారి సౌకర్యం కూడా లేని గుమ్మరేవుల పంచాయతీలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు గ్రామాలకు చేరాయి. దారకొండ నుంచి గుమ్మరేవుల వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం పూర్తిచేశారు. దీంతో ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు సైతం గుమ్మరేవుల మీదుగా సరిహద్దు ప్రాంతాల వరకు రాకపోకలు సాగించే పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ సచివాలయం, విలేజ్‌ క్లినిక్‌, సంపద కేంద్రం, సీసీ రోడ్లు, సెల్‌ఫోన్‌ టవర్ల నిర్మాణం వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న గుమ్మరేవుల ప్రాంతంలో వరుసగా మూడుసార్లు వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడం స్థానిక రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పును సూచిస్తోంది. మొత్తంగా ఒకప్పుడు ఎన్నికల నిర్వహణే సవాల్‌గా ఉన్న గుమ్మరేవులలో ఇప్పుడు సొంత పంచాయతీ కేంద్రంలోనే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండటం విశేషం.

ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావం

అప్పుడు భయం.. ఇప్పుడు ఓటు హక్కు!

దశాబ్దాల నిరీక్షణకు తెర

గుమ్మరేవులలో తొలిసారి పోలింగ్‌!

అడవిలో మారిన పరిస్థితులు

పంచాయతీలో ఎన్నికల సందడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement