విద్యావంతులైన నాయకత్వం అవసరం | - | Sakshi
Sakshi News home page

విద్యావంతులైన నాయకత్వం అవసరం

Nov 26 2026 12:18 AM | Updated on Nov 26 2026 12:18 AM

మాజీ మంత్రి బాలరాజు

చింతపల్లి: ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ వనరులను కాపాడే విద్యావంతులైన నాయకులను ఎన్నుకోవాలని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మన్యంలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుని సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలన్నారు. పాడేరు, అరకు, చింతపల్లి వంటి ప్రాంతాల్లో ప్రజల అవసరాలు చాలా తీవ్రంగా ఉన్నాయన్నారు. సమస్యలు పరిష్కరించగలిగే వ్యక్తిని ఎన్నుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందువల్ల విద్యావంతులైన యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు రానంత మాత్రాన ప్రజలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని భావించకూడదని, ఓటింగ్‌ సరళిని బేరీజు వేసుకోవాలన్నారు. అల్లూరి జిల్లాలోని విలువైన వనరులను బయటి వ్యక్తులకు కట్టబెట్టే బినామీలకు, తప్పుడు తీర్మానాలు చేసే వారికి ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరించారు. బయటి వ్యక్తుల ఆదేశాలతో కాకుండా స్థానిక అవసరాలను గుర్తించి, ప్రాంత అభివృద్ధి కోసం పాలకుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లే జవాబుదారీతనం ఉన్న నాయకత్వాన్ని బలపరచాలని సూచించారు. అభివృద్ధిలో ఎంతో వెనుకబడిన మన్యంలోని సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కనీస అవసరాలైన వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుని తగిన నిధులు కేటాయించాలని కోరారు. పాడేరు పట్టణంలో రోడ్డు వెడల్పు ప్రక్రియ ఒక సినిమాలా కొనసాగుతోందే తప్ప, ఆ విస్తరణ కార్యక్రమం కార్యరూపం దాల్చే పరిస్థితి కనబడడం లేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement