ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్‌సీ) బుధవారం ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది వైద్య ఆరోగ్య నిపుణులతో కూడిన కేంద్ర బృందం తనిఖీ చేసింది. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి, రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గర్భిణుల ప్రసవాలు, ల్యాబ్ పరీక్షలు, మలేరియా, టైఫాయిడ్, టీబీ వంటి వ్యాధుల నమోదు, మందుల నిల్వల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్‌ఎన్‌సీయూ)ను పరిశీలించారు. బాలింతలు, నవజాత శిశువుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు సేకరించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలని, వార్డులను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. తదుపరి స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1ను సందర్శించారు. రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థినులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎంలు విద్యార్థినులకు అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. రక్తహీనత బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. పిల్లల బరువులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ కేంద్ర బృందం సభ్యులు అనినాష్ సుంధ్లియా, సిద్ధార్థ్ మౌర్య, సపావత్ శంకర్, శ్రీరామ్ విగోసావి, శత్రుఘ్న ఠాకుర్, దీపక్‌కుమార్, రమణ యాడ్ల, మహిమసింగ్‌లతో పాటు రాష్ట్ర బృందం సభ్యులు ఎల్‌బీఎస్‌హెచ్ దేవి, చక్రవర్తి, సతీష్‌కుమార్, సుబ్రహ్మణ్యం, నరేంద్రకుమార్, వాసుబాబు, రామకృష్ణ, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రియాజ్‌బేగ్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నీలవేణి, సూపరింటెండెంట్ ధరణి, వైద్యులు ఆదిత్య, గీతాంజలి పాల్గొన్నారు.
పర్యటించిన ఢిల్లీ బృందం


