కొయ్యూరు: మారుమూల యూ.చీడిపాలెం పంచాయతీ పరిధిలోని తీగలమెట్ట గ్రామానికి చెందిన రెండు నెలల ఏడు రోజుల శిశువు తారాబు గాయత్రి మృతిపై జిల్లా మలేరియా అధికారి(డీఎంవో) తులసి సోమవారం విచారణ చేపట్టారు. వైద్యుడు హేమంత్‌తో కలిసి మండల కేంద్రానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లి శిశువు తల్లి కాసులమ్మతో పాటు స్థానిక గిరిజనులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయత్రి ఈ ఏడాది ఆగస్టు 19న జన్మించింది. ఈ నెల 2న శిశువుకు దగ్గు, జలుబు లక్షణాలు కనిపించాయి. దీంతో 3న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు శిశువుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని గుర్తించి కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే తల్లి కాసులమ్మ తెలిసిన వారి సాయంతో నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో 4న కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు శిశువు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి శిశువు మృతి చెందింది.
ఆస్పత్రికి తీసుకెళ్లడంలో జాప్యమే కారణం
శిశువు మృతి సమాచారంతో డీఎంవో తులసి సోమవారం తీగలమెట్ట గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. గత నెలలో బాలింతకు వైద్య పరీక్షలు నిర్వహించగా జ్వరం లేనట్లు రికార్డుల్లో నమోదైందని పరిశీలించారు. గ్రామంలోని గిరిజనులను కూడా విచారించారు. శిశువును ఆస్పత్రికి తరలించడంలో జరిగిన జాప్యం మృతికి కారణమైందని విచారణలో నిర్ధారించినట్లు తెలిపారు. ఇటీవల రెండు తుపాన్ల ప్రభావంతో వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరాలు వచ్చే అవకాశం ఉందని డీఎంవో పేర్కొన్నారు. గిరిజనులు అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆస్పత్రులకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
మారుమూల తీగలమెట్ట గ్రామానికి వెళ్లిన డీఎంవో
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో కేజీహెచ్‌లో చికిత్స
వైద్యం అందించడంలో జాప్యమే కారణమని నిర్ధారణ


