మునగపాక: కొడుకులు లేకపోవడంతో భర్తకు తల కొరివి పెట్టి భార్య రుణం తీర్చుకున్న సంఘటన మండల కేంద్రమైన మునగపాకలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మునగపాకకు చెందిన ఆడారి రవి స్థానికంగా సిమెంట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు. ఆదివారం రాత్రి రవి మృతి చెందారు. రవికి భార్య లక్ష్మితో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేకపోవడంతో భార్య లక్ష్మి ముందుకొచ్చి భర్త రవి మృతదేహానికి తల కొరివి పెట్టి చితికి నిప్పంటించి రుణం తీర్చుకుంది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది.రవి అంత్యక్రియలకు గ్రామస్తులు భారీగా హాజరయ్యారు.


