యలమంచిలి రూరల్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన యలమంచిలి పంచరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా దీపావళి నుంచి నాగులచవితి వరకు పట్టణంలో తులసీనగర్ భూలోకమాంబ అమ్మవారు, పాతవీధి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ కమిటీలు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భూలోకమాంబ అమ్మవారి సన్నిధిలో తొలిపూజ ఆడారి శ్రీధర్(చిన్నా) దంపతులు చేశారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అయిదురోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించనున్నట్టు అర్చకుడు తెలిపారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్,మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, మున్సిపల్ చైర్పర్సన్ పిళ్లా రమాకుమారి సహా పలువురు ప్రముఖులు అమ్మవారు, సుబ్రహ్మణ్యసామిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీల ప్రతినిధులు అతిధులకు స్వాగతం పలికి, శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. ఉత్సవాల సందర్భంగా యలమంచిలి పట్టణంలో ప్రధాన రహదారి, దిమిలిరోడ్డు కూడలి,అంతర్గత రహదారులన్నీ విద్యుద్దీపాలతో అలంకరించారు.కార్యక్రమంలో మళ్ల కొండబాబు, కర్రి జానకీరాం,ఆడారి పూరీ జగన్నాథం, ఆడారి ఆదిమూర్తి పాల్గొన్నారు.


