దేవరాపల్లి: మండలంలోని రైవాడలో ఇటీవల పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటనలో చల్లా ఈశ్వరరావు(బుజ్జి) భార్య చల్లా నాగమణి ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 2న కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ తల్లి వరహాలమ్మ(60) మృతిచెందిన విషయం విదితమే. ఎస్‌ఐ వి. సత్యనారాయణ వివరాల ప్రకారం.. ఈ నెల 1న రైవాడలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఈశ్వరరావు క్షణికావేశంలో ఇంటిలో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న భార్య నాగమణి, తల్లి వరహాలమ్మతో పాటు తనపైన పెట్రోలు పోసుకొని, మిగిలిన పెట్రోలును పొయ్యిలో వేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముగ్గురు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఈశ్వరరావు అలియాస్ బుజ్జి(45), భార్య నాగమణి (38), తల్లి వరహాలమ్మ(60)లను అదే రోజు కేజీహెచ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ చికిత్స పొందుతున్న భార్య నాగమణి మృతి చెందింది. ఆమె తల్లి బార పార్వతి ఫిర్యాదు మేరకు నిందితుడు ఈశ్వరరావుపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.
ఇద్దరు బిడ్డలకు తల్లి ప్రేమను దూరం చేసిన క్షణికావేశం....
క్షణికావేశంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. వారం రోజలు వ్యవధిలో ఒకే ఇంట్లోని అత్త, కోడలు మృతి చెందడంతో తీవ్ర విషాదం మిగిల్చింది. వెరసి అభంశుభం తెలియని ఇద్దరు బిడ్డలను తల్లి ప్రేమకు దూరం చేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరగా, ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చల్లా ఈశ్వరరావు (బుజ్జి) పరిస్థితి కూడా విషమంగా ఉంది. స్వగ్రామం రైవాడలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
కేజీహెచ్‌లో భర్త ఈశ్వరరావు పరిస్థితి విషమం


