చింతపల్లి: కాఫీ తోటలో పండ్లు సేకరిస్తున్న గిరిజన రైతుపై అడవిపంది ఒక్కసారిగా దాడి చేసింది. ఊహించని ఈ ఘటనతో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. చేయి, నడుము, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో తోటి రైతులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన శుక్రవారం గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దామనాపల్లి పంచాయతీ కేంద్రానికి చెందిన సాకెరి నాగేశ్వరరావు రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం కాఫీ తోటలో పండ్లు సేకరించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో తోటలో ఉన్న అడవిపంది ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. దీంతో నాగేశ్వరరావు చేయి, నడుము భాగంతో పాటు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న తోటి గిరిజన రైతులు గమనించి వెంటనే చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యాధికారి తేజ్ నారాయణ ప్రాథమిక వైద్యసేవలు అందించి, మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.


