బీచ్‌రోడ్డు: ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసిపాప వైద్యం కోసం విశాఖ ట్రాఫిక్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. టూ టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ సుసన్న బిడ్డ అర్ధాంతరంగా జన్మించి మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారి వైద్య ఖర్చులకు సుమారు రూ.18 లక్షల వరకు అవసరం కావడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో తోటి ఉద్యోగికి అండగా నిలవాలని ట్రాఫిక్ విభాగం సిబ్బంది నిర్ణయించారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది నుంచి సేకరించిన రూ.3.5 లక్షలను శుక్రవారం ట్రాఫిక్ ఏసీపీ చేతుల మీదుగా తల్లి సుసన్నకు అందజేశారు. ఖాకీ వెనుక మానవత్వం ఉందని నిరూపిస్తూ, కష్టకాలంలో తోటి కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలిచారు. త్వరలోనే పూర్తి మొత్తం సమకూరి చిన్నారి ఆరోగ్యంగా ఇంటికి చేరాలని ట్రాఫిక్ పోలీసులు ఆకాంక్షించారు.


