● బూత్‌ల వద్ద హడావుడి
● ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
● ఓటర్ల జాబితాల్లో గందరగోళం
● అభ్యర్థికే దక్కని ఓటు హక్కు
సాక్షి, పాడేరు: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ గురువారం జిల్లాలోని 11 మండలాల్లో అధికార యంత్రాంగం, పోలీసుల పర్యవేక్షణలో జరిగింది. అయితే మరోవైపు పోలింగ్ కేంద్రాల ఆవరణలో కూటమి అభ్యర్థులు, నేతలు, కార్యకర్తల హడావుడి అధికంగా కనిపించినా.. వారిని నియంత్రించాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
● ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు మెల్లమెల్లగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రక్రియ మందకొడిగానే సాగింది. జిల్లాలోని 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల కోసం మొత్తం 617 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 44 సమస్యాత్మక కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ నిర్వహించారు. దీంతో ఆయా కేంద్రాల్లో పోలింగ్ శాతం 50కి మించలేదని తెలుస్తోంది. మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. అన్ని మండలాల్లోనూ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు.
మారిన బూత్‌లు.. ఓటర్లకు తిప్పలు
పాడేరుతో పాటు పలు ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలు తారుమారు కావడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంపీటీసీ సెగ్మెంట్లు సైతం మారిపోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. పాడేరు ఎంపీటీసీ స్థానం–1 నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కురుసా లక్ష్మయ్యకు ఆ సెగ్మెంట్‌లో ఓటు లేకపోవడం గమనార్హం. రెండో సెగ్మెంట్‌లో ఓటు ఉండటంతో తాను పోటీ చేస్తున్న స్థానంలో తన ఓటు తానే వేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబంలోని సభ్యుల ఓట్లు సైతం వేర్వేరు సెగ్మెంట్లకు మారడంతో గందరగోళం నెలకొంది. పాడేరు పట్టణంలో భార్యాభర్తలు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయాల్సి రావడం చర్చనీయాంశమైంది.
కూటమి నేతలదే హవా
జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి నేతల హడావుడి కనిపించింది. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూటమి అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు కేంద్రాల ఆవరణలో సంచరిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారనే ఆరోపణలు వినిపించాయి. పాడేరు జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాల్లో కూటమి నేతలు, సంబంధిత ఎంపీటీసీ అభ్యర్థులు అక్కడి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాలుగో సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి కూడా సురేష్‌కుమార్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ రీజినల్ చైర్మన్, అరకు టీడీపీ ఇన్‌చార్జి దొన్నుదొర నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్దకు వాహనంతో సహా నేరుగా వెళ్లారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన అధికారులు ఆయనను అడ్డుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. అలాగే జనసేన నేత, రాష్ట్ర కళలు, జానపద విభాగం చైర్మన్ గంగులయ్య గూడెంకొత్తవీధి మండలం జర్రెల పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడంపై ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం పలు పోలింగ్ కేంద్రాల్లో సంచరించినా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
గూడెంకొత్తవీధి: గూడెం పంచాయతీలోని 1, 2, 3 సెగ్మెంట్ల పోలింగ్ కేంద్రాలను చింతపల్లి ఏఎస్పీ నిరంజన్ మహేంద్ర సిన్హ పరిశీలించారు. పోలింగ్ సరళిపై ఆర్‌వో నాయక్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై పోలీసు సిబ్బందితో సమీక్షించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పటిష్ట భద్రత కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అన్నాజీరావు పాల్గొన్నారు.


