ముంచంగిపుట్టు: మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బూసిపుట్టు, బుంగాపుట్టు, రంగబయలు పంచాయతీలకు చెందిన గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుదూర ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో కొందరు ఓటు వేసేందుకు రాలేకపోయారు. దీనికితోడు రంగబయలు, బూసిపుట్టు, బాబుశాల, బుంగాపుట్టు, వనుగుమ్మ, కుమడ పంచాయతీల్లోని సమస్యాత్మక ప్రాంతాల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగించారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సుజనకోట పంచాయతీలోని 12 గ్రామాల గిరిజనులు, పెదగూడ పంచాయతీ పరిధిలోని దొరగూడ, వనుగుమ్మ పంచాయతీలోని ఒలైబీరు గ్రామాల ఓటర్లు మత్స్యగెడ్డను నాటు పడవలపై దాటి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ గ్రామాలకు సమీపంలోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల ఓటర్లు కోరుతున్నారు. మరోవైపు పలు పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టెంట్లు లేక ఎండలోనే గంటల తరబడి నిరీక్షించి ఓటు వేయాల్సి వచ్చింది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు లేక అవస్థలు ఎదుర్కొన్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలనుంచి ఇబ్బందులు పడుతూ వచ్చిన గిరిజన ఓటర్లు
నాటు పడవలపై మత్స్యగెడ్డ దాటి పోలింగ్ కేంద్రాలకు చేరిక
సమస్యాత్మక కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగింపు
కనీస సౌకర్యాలు లేక ఓటర్ల అవస్థలు


