డుంబ్రిగుడ: మండలంలోని చంపపట్టి, శిలంగొంది, జాంకరవలస తదితర ఐదు గ్రామాల గిరిజనులు వంతెన నిర్మాణంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం ఆందోళనకు దిగారు. వంతెన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ ధర్నా నిర్వహించారు. అయితే సాయంత్రం 4 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
● 2014లో హుద్‌హుద్ తుపాను ప్రభావంతో చంపపట్టి వద్ద ఉన్న వంతెన కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ ఐదు గ్రామాల గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ.. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో సుమారు 12 ఏళ్లుగా వంతెన నిర్మాణం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. తమ రాకపోకల కష్టాలను గుర్తించి కూటమి ప్రభుత్వం స్పందించాలని, వెంటనే వంతెన నిర్మాణం చేపట్టి ఐదు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని గిరిజనులు కోరుతున్నారు.
ఐదు గ్రామాల గిరిజనుల ధర్నా
స్పష్టమైన ఇవ్వకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరిక
ఎట్టకేలకు సాయంత్రంఓటు హక్కు వినియోగం


