గూడెంకొత్తవీది: జెర్రెల ఎంపీటీసీ సెగ్మెంట్‌లోని పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేకుండా జనసేన నాయకుడు వంపూరి గంగులయ్య, పార్టీ సమన్వయకర్త గొర్లె వీరవెంకట్ వెళ్లడం వివాదానికి దారితీసింది. వారిని గమనించిన వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా పోలింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతించారంటూ ఎస్‌ఐ సురేష్‌ను ప్రశ్నించారు. ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో ఎస్‌ఐ వెంటనే వారిని బయటకు పంపించారు. మరోవైపు గూడెం పోలింగ్ కేంద్రంలో టీడీపీ మండల కార్యదర్శి పసుపులేటి నాగమణి అనుమతి లేకుండా సెల్‌ఫోన్ తీసుకెళ్లి ఫొటోలు తీస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలువురు విమర్శించారు.


