సదస్సులో ప్రసంగిస్తున్న వక్తలు
ఏయూ క్యాంపస్: మెట్రో నగరాలకే పరిమితం కాకుండా టైర్–2, టైర్–3 నగరాల్లోనూ పరిశ్రమలను విస్తరించాల్సిన అవసరం ఉందని ఎన్ ల్యాబ్స్ ఏఐ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో కల్పన పెనుమత్స సూచించారు. బీచ్‌రోడ్డులోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన ‘ఈస్ట్ వేవ్–2026, జీసీసీ అండ్ ఏఐ కాన్‌క్లేవ్’లో ఆమె మాట్లాడారు. స్వయం సమృద్ధితోనే పారిశ్రామిక రంగ భవిష్యత్తు మెరుగుపడుతుందన్నారు. ఇంటర్నెట్, డిజిటల్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశాలు పెరిగాయని, పరిశ్రమలను కేవలం మెట్రో నగరాలకే పరిమితం చేయాల్సిన అవసరం లేదన్నారు. చిన్న నగరాలు, పట్టణాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. స్టార్టప్‌లు దీర్ఘకాలం కొనసాగేందుకు అవసరమైన ప్రోత్సాహం కల్పించాలన్నారు.


