రాత్రివేళ బస్సుకు కార్ల అడ్డంకులు రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి డాల్ఫిన్ హిల్స్ వద్ద నిత్యం ఇదే సమస్య.. పట్టించుకోని అధికారులు
మల్కాపురం: యారాడ గ్రామానికి వెళ్లాలంటే ఆ ఒక్క మార్గమే ఆధారం. అలాంటి ప్రధాన మార్గానికే రాత్రివేళ కార్లు అడ్డుగా నిలుస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డాల్ఫిన్ హిల్స్ నేవల్ క్వార్టర్స్ వద్ద కొందరు తమ కార్లను రహదారికి అడ్డంగా నిలుపుతుండటంతో ఆర్టీసీ బస్సు గ్రామంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో బస్సులో ప్రయాణించే గ్రామస్తులు రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. యారాడ గ్రామానికి చేరుకోవాలంటే రెండు ఎత్తైన కొండలను దాటుకుని వెళ్లాలి. గ్రామానికి నిత్యం వచ్చే 16 నంబరు ఆర్టీసీ బస్సు ద్వారా ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే గ్రామానికి సమీపంలోని డాల్ఫిన్ హిల్స్ ప్రాంతంలో ఉన్న నేవల్ క్వార్టర్స్ వద్ద నుంచే బస్సు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్వార్టర్స్‌లో నివసించే కొందరు నేవీ ఉద్యోగులు రాత్రివేళ తమ కార్లను బస్సు వెళ్లే మార్గానికి అడ్డంగా నిలుపుతున్నారు. దీంతో బస్సు గ్రామంలోకి వెళ్లలేకపోతోంది.
కార్లు అడ్డం.. రెండు కి.మీ. నడక
బుధవారం రాత్రి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. గ్రామానికి వెళ్లాల్సిన బస్సు మార్గంలో కార్లు అడ్డంగా ఉండటంతో అక్కడే నిలిచిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు రెండు కిలోమీటర్ల దూరం కొండ దిగువకు నడుచుకుంటూ వచ్చారు. బస్సులో రావాల్సిన వారు కాలినడకన రావడంతో అక్కడున్న గ్రామస్తులు కారణం అడిగారు. కార్లు అడ్డంగా ఉండటంతో నడుచుకుంటూ రావాల్సి వచ్చిందని ప్రయాణికులు వివరించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు డాల్ఫిన్ హిల్స్ వద్దకు వెళ్లి నేవీ సిబ్బందితో వాదించారు. అనంతరం మార్గానికి అడ్డంగా ఉన్న కార్లను తొలగించారు. అయితే ఇది ఒక్కరోజు సమస్య కాదని, ప్రతిరోజూ రాత్రివేళ ఇదే ఇబ్బంది ఎదురవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు రాకపోకలకు ఆటంకం కలగకుండా అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.


