తెనుగుపూడి గురుకుల విద్యాలయానికి బ్యాలెట్ బాక్స్‌లతో చేరుకుంటున్న పోలింగ్ సిబ్బంది
దేవరాపల్లి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ ప్రక్రియ పూర్తికావడంతో బ్యాలెట్ బాక్స్‌లను బస్సుల్లో తెనుగుపూడిలోని డాక్టరు బీఆర్. అంబేడ్కర్ బాలుర గురుకుల విద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌కు గురువారం రాత్రి పటిష్ట బందోబస్తు నడుమ తరలించారు. దేవరాపల్లి, కె.కోటపాడు మండలాలకు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేసి, కౌంటింగ్‌ను సైతం చేపట్టేందుకు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దేవరాపల్లి మండలంలో 58 పోలింగ్ కేంద్రాలు, కె.కోటపాడు మండలంలో 63 పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్స్‌లను పోలింగ్ సిబ్బంది నుంచి అధికారులు స్వీకరించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్.మంజులవాణి, ఎంపీడీవో ఎస్.కె.వి. వరప్రసాద్, తహసీల్దార్ పి.లక్ష్మీదేవి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ఆర్వోలు, ఇతర అధికార్లు, పోలీస్ బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచారు.


